తేలని నీటి వాటాలు!
తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల పంచాయితీ మళ్లీ వాయిదా
- కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీలో కుదరని ఏకాభిప్రాయం
- 50:50 వాటాకు తెలంగాణ పట్టు
- పోతిరెడ్డిపాడుపై అభ్యంతరం
- ఇప్పటికే 10 టీఎంసీలు వాడుకున్నారని ఫిర్యాదు
- తాగునీటి కోసం 47 టీఎంసీలు కోరిన ఏపీ
- సెప్టెంబర్ 4న మరోసారి సమావేశం
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాం తి) : కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి వాటాల వివాదం తెరపైకి వచ్చింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ఏ అవసరాలకు వినియోగించాలి? రెండు రా ష్ట్రాలకు ఎంత మేర నీటిని కేటాయించాలి? తాగునీటి అవసరాల పేరుతో ఏపీ కోరుతు న్న నీటిని ఏ ప్రాతిపదికన విడుదల చేయా లి? అనే అంశాలపై సోమవారం హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమి టీ సమావేశమైంది.
కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ సతీశ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఈఎన్సీ రమేష్‌బాబు, ఏపీ ఈఎ న్సీ నరసింహమూర్తి పాల్గొన్నారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లో ఉన్న నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి జరుగుతున్న నీటి వినియోగంపై అధికారులు సుదీర్ఘంగా చర్చి ంచారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో కృ ష్ణా జలాలను తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాల్సిన అవసరం ఉందని తెలంగాణ వాదించింది.
తాగునీటి కోసం కేటాయించే నీటిని రెండు రాష్ట్రాలకు సమానంగా 50:50 నిష్పత్తిలో పంపిణీ చే యాలని తెలంగాణ కోరింది. ప్రస్తుత నీటి పరిస్థితుల్లో తాగునీటి అవసరాలను చూపి స్తూ ఒక రాష్ట్రం అధికంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉండకూడదన్నది తెలంగాణ వాదనగా కనిపిస్తోంది. తాగునీరు రెండు రాష్ట్రాలకూ అవసరమే కాబట్టి, అందుబాటులో ఉన్న నీటిని సమాన ప్రాతిపదికన పంచుకోవాలని తెలంగాణ కోరుతోంది.
ముఖ్యంగా శ్రీశైలం, నాగా ర్జునసాగర్ జలాశయాల్లో పరిమితంగా ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితి ఉన్నందున, ఏపీ ప్రతిపాదనలకు వెంటనే అంగీకరించకూడదని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ మాత్రం పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరుతోంది.
ఇదే అంశంపై త్రిస భ్య కమిటీని ఏర్పాటు చేయాలని గతంలో ఏపీ కేఆర్‌ఎంబీని కోరింది. సమావేశం రెండుసార్లు వాయిదా పడిన అనంతరం సోమవారం భేటీ జరిగింది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కమిటీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలపై అభ్యంతరం
సమావేశంలో పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ చేస్తున్న నీటి వినియోగం కీలక అంశంగా మారింది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ సుమారు 10 టీఎంసీల నీటిని వినియోగించుకుందని తెలంగాణ ఈఎన్సీ రమేష్‌బా బు కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు. తాగునీటి అవసరాల పేరుతో నీటి వినియోగాన్ని కొనసాగించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి వినియోగంపై అధికారికంగా కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసినట్లు రమేష్‌బాబు తెలిపారు.
ఇకపై పోతిరెడ్డిపాడు నుంచి నీటిని వినియోగించబోమని ఏపీ అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. దీంతో ఈ అంశం సెప్టెంబర్ 4న జరిగే తదుపరి సమావేశంలోనూ ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, మొత్తం నీటి సంవత్సరానికి సంబంధించి తమ అవసరాలపై ఏపీ ప్రతిపాదనలు చేసినట్లు ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. అక్టోబర్ వరకు నీటి కేటాయింపులు చేయాలని కోరినట్లు చెప్పారు.
తమ రాష్ట్రానికి 47 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ కోరిందన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీల నీటి వినియోగానికి తెలంగాణ అంగీకరించిందని నరసింహమూర్తి పేర్కొన్నారు. అయితే తెలంగాణ వైపు నుంచి మాత్రం పోతిరెడ్డిపాడు నీటి వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి వాదనలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసిన భేటీ
సోమవారం జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలు, అవసరాలను కేఆర్‌ఎంబీ ముందు ఉంచాయి. అయి తే నీటి వాటాలపై స్పష్టమైన ఏకాభిప్రాయం రాకపోవడంతో త్రిసభ్య కమిటీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా తాగునీటి అవసరాలకు ఎంత నీరు అవసరం? రెండు రాష్ట్రాలకు ఎంత కేటాయిం చాలి? ఇప్పటికే వినియోగించిన నీటిని ఎలా పరిగణించాలి? పోతిరెడ్డిపాడు నుంచి జరుగుతున్న వినియోగాన్ని ఏ విధంగా లెక్కించాలి? వంటి అంశాలపై మరింత చర్చ అవసరమని భావించింది.
దీంతో సెప్టెంబర్ 4న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఆ సమావేశంలో తాగునీటి అవసరాలకు సంబంధించిన నీటి కేటాయింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కృష్ణా జలాల విషయంలో ప్రతి టీఎంసీ కూడా కీలకంగా మారుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 4న జరిగే కేఆర్‌ఎంబీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని రెండు రాష్ట్రాలు చెబుతున్నా, ఎవరి అవసరాలు ఎంత? అందుబాటులో ఉన్న నీరు ఎంత? గతంలో ఎవరు ఎంత వినియోగించారు? అనే అంశాలపై లెక్కలు కీలకం కానున్నాయి. తెలంగాణ మాత్రం తాగునీటి వాటాను 50:50 నిష్పత్తిలో పంచాలని పట్టుబడుతోంది.
ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 10 టీఎంసీల నీటిని వినియోగించిందని ఫిర్యాదు చేయడం ద్వారా, భవిష్యత్ కేటాయింపుల్లో గత వినియోగాన్ని కూడా పరిగ ణనలోకి తీసుకోవాలనే వాదనను ముందు కు తీసుకెళ్తోంది. మరోవైపు ఏపీ మాత్రం రాయలసీమ, పల్నాడు ప్రాంతాల తాగునీటి అవసరాలను ప్రస్తావిస్తూ 47 టీఎంసీల నీటిని కోరుతోంది. అందువల్ల వచ్చే సమావేశంలో తాగునీటి వాటాల పంపిణీతో పాటు పోతిరెడ్డిపాడు నీటి వినియోగం, ఇప్పటికే వినియోగించిన నీటి లెక్కలు, అక్టోబర్ వరకు నీటి కేటాయింపులు కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.
ఆగస్టు 2027 వరకు 112 టీఎంసీలు కావాలి
ఆగస్టు 2027 వరకు తెలంగాణ నీటి అవసరాలను తీర్చేందుకు 112 టీఎంసీల నీటిని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రానున్న నెలల్లో ఎల్ నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉం దని, దీంతో వర్షపాతం, నీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంటూ భవిష్యత్ నీటి అవసరాలను ముందుగానే అంచనా వేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, మిషన్ భగీరథ, ప్రజారోగ్య పథకాల ద్వారా ప్రజ ల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 50 టీఎంసీల నీరు అవసరమని ప్రభు త్వం ఇప్పటికే వెల్లడించింది.
ఎల్‌నినో ప్ర భావంతో ఏర్పడే నీటి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మరో 53 టీ ఎంసీల నీరు అవ సరమంది. చెరువులు, కుంటలు, ట్యాంకులను నింపి పశు వులు, ఇతర జీవులకు నీటి లభ్యత కల్పించడం, కనీస పర్యావర ణ అవసరాలను తీర్చడం, భూగర్భ జ లాల రీచార్జ్‌ను కొనసాగించడం కోసం అ దనపు నీటిని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందది.
ఈ ఏడాది మే 14న జారీ చేసిన నీటి విడుదల ఉత్తర్వుల మేర కు, 2026 ఆగస్టు 12 నాటికి తెలంగాణకు ఇంకా 8.80 టీఎంసీల నీటిని డ్రా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఎంజీకే ఎల్‌ఐఎస్ కింద 0.80 టీఎంసీలు, ఎన్‌ఎస్‌ఎల్సీ, ఏఎంఆర్పీ కింద కలిపి 8 టీఎంసీ లున్నాయి. ఇప్పటికే గు ర్తించిన తాగునీటి అవసరాలు, నీటి ఒత్తిడి పరిస్థితుల్లో అవసరమయ్యే అదనపు నీరు, ఇంకా డ్రా చేసుకోవాల్సిన 8.80 టీఎంసీలను కలిపి చూస్తే మొత్తం అవసరం సు మారు 111. 80 టీఎంసీలు అవుతోంది దీనిని ప్రభుత్వం 112 టీఎంసీలుగా పేర్కొంది.






