25 August, 2026 | 6:06 AM

మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేయాలి

25-08-2026 01:59 AM

జిల్లా కలెక్టర్ కె. హైమావతి 

సిద్దిపేట కలెక్టరేట్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించి ఒక్కో పంచాయతీ పరిధిలో 1,000 మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటేందుకు అనుకూల సమయమని, వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 17.68 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  ఇప్పటికే 2 లక్షలకు పైగా గుంతలు సిద్ధం చేశామని, మిగిలిన గుంతలు తవ్వి మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు.

మున్సిపాలిటీలు, ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇరిగేషన్ శాఖ ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ సూచించారు.

వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో శానిటేషన్ చేపట్టాలని,జిల్లాలోని 780 మంది టీబీ రోగుల మందుల వినియోగంపై సమీక్ష చేయాలని జిల్లా  వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.సెన్సెస్ 2027కు సంబంధించిన వివరాలను ప్రొఫార్మా ప్రకారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.