25 August, 2026 | 2:38 AM

ఫీజుల బకాయిపై బీజేపీ పోరు ఆగదు

25-08-2026 01:34 AM

ఐదు లక్షల మంది విద్యార్థుల సంతకాల సేకరణ 

  1. విద్యావ్యవస్థను సీఎం గాలికొదిలేశారు 
  2. ఉస్మానియా వర్సిటీకి వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదు! 
  3. గత ప్రభుత్వంలో ఫీజు బకాయిలు రూ.8వేల కోట్లు.. ఈ ప్రభుత్వంలో రూ.4 వేల కోట్లు 
  4. నిరాహార దీక్షలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు 
  5. దీక్షకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల మద్దతు

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాం తి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీ జేపీ పోరాటం కొనసాగుతోందని, ‘మా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మాకివ్వండి’ అంటూ ఐదు లక్షల మంది విద్యార్థు లు స్వయంగా సంతకాలు చేసి కాంగ్రెస్ ప్ర భుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. విద్యావ్యవస్థను సీఎం గాలికొదిలేశా రని, ఉస్మానియా వర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించి.. కనీసం రూ.వెయ్యి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

గత ప్రభుత్వంలో ఫీజు బకాయిలు రూ.8 వేల కోట్లు ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయన్నారు. కొండా సురేఖ బీజేపీలో చేరుతారనే ప్రచారంపై రాంచందర్‌రావు స్పందిస్తూ.. దానికి సంబంధించి పార్టీ అధిష్ఠానం నిర్ణ యం తీసుకుం టుందన్నారు. ఫీజుల బకాయి-బీజేపీ లడా యి పేరుతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాంచందర్‌రావు రెండు రోజుల దీక్షను సోమవారం పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.

పార్టీ ఎంపీలు లక్ష్మణ్, డీకే అరు ణ, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, ఆర్.కృష్ణయ్య, రేఖాశర్మతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు, విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల సంఘాలు, వివధ వర్గాలు దీక్షకు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ...ఫీజు బకాయిల కోసం విద్యార్థులు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తే.. వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే విద్యాశాఖను నిర్వహిస్తున్నారు.. అయినా విద్యా వ్యవస్థను గాలికొదిలేశారన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్లు పెంచి మొత్తం బకాయిలను రూ.12 వేల కోట్లకు చేర్చిందన్నారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు.

ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయని, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని తెలిపారు. యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో వచ్చే సంవత్సరానికి అడ్వాన్స్‌గా రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల కోసం పోరాడితే వారిపై లాఠీచార్జ్ చేయించారని పేర్కొన్నారు. ఆయుష్, హోమియోపతి విద్యార్థులు స్టైఫండ్ కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

దమ్ముంటే తెలంగాణకు వచ్చి.. ఇక్కడి విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? స్కాలర్‌షిప్స్ ఎందుకు అందడం లేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. <

వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న సీఎం: ఎంపీ ఆర్.కృష్ణయ్య

తాము బీసీ సంఘాలుగా, రాజకీయ నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమిస్తుంటే.. సమస్యను పరిష్కరించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ముఖ్యమంత్రి వైఖరికి నిదర్శనమని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ఉద్యమిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ఉన్నావు.. అక్కడికి వెళ్లి ఉద్యమాలు చేయాలి అంటూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రతి సమస్యను డైవర్ట్ చేయడం కాకుండా.. దాని పరిష్కారానికి ముఖ్యమంత్రి ప్రయత్నించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకొని అవసరమైన నిధులు తీసుకొస్తామన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌లు నిర్వహించినా.. వారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం వారిని బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తోందన్నారు. 

యువత పక్షాన బీజేపీ: బీజేపీ ఎంపీ రేఖాశర్మ 

విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీజేపీ వారి పక్షాన నిలబడి పోరాడుతోందని బీజేపీ ఎంపీ రేఖాశర్మ తెలిపారు. యువత గురించి మాట్లాడేందుకు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లేందుకు సమయం ఉన్న కాంగ్రెస్‌కు చెందిన ఓ స్వయంప్రకటిత యువ నాయకుడికి.. చదువు కొనసాగించడానికే ఇబ్బందులు పడుతున్న తెలంగాణ విద్యార్థుల వద్దకు వచ్చి వారికి అండగా నిలబడేందుకు మాత్రం సమయం లేదన్నారు.

నిన్ననే పుణెలో 58 ఏళ్ల కాంగ్రెస్ యువ నాయకుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు ఇవ్వగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని, వారి చదువు, భవిష్యత్తును కాపాడగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారన్నారు. మరి తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అలాంటప్పుడు ఇక్కడి యువత తమ కనీస హక్కుల కోసం ఇంతగా ఎందుకు పోరాడాల్సి వస్తోంది? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. మోదీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన మార్పుల మాదిరిగానే.. తెలంగాణలో కూడా మార్పు, అభివృద్ధి, అవకాశాలతో కూడిన కొత్త యుగాన్ని తప్పకుండా తీసుకొస్తామన్నారు. 

అండగా బీజేపీ: ఏలేటి

శాంతియుతంగా దీక్ష చేపడతామంటే కనీసం అనుమతి కూడా ఇవ్వని నిరంకుశ పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా, మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను నిలువునా మోసం చేసిందన్నారు.

మధ్యాహ్న భోజన పథకానికి సైతం సక్రమంగా నిధులు కేటాయించడం లేదని, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 8 శాతం మాత్రమే కేటాయించడం విద్యపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని 30 వేల పాఠశాలల్లో సుమారు 21 వేల పాఠశాలలకు కనీసం సరైన మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని, రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం విదేశీ పర్యటనలతో కాలం గడుపుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉసురు తగులుతుంది: ఎంపీ లక్ష్మణ్

ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల ఉన్నత విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నులుముతోందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అన్న సీఎం రేవంత్‌కు వారి ఉసురు తగలక తప్పదన్నారు. రూ. 12 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదన్నారు. తెలంగాణలో ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. పేదరికం నుంచి బయటపడేందుకు ఉన్నత విద్యను ఆశ్రయించిన యువతకు ఈ కాంగ్రెస్ సర్కార్ తీవ్ర ద్రోహం చేస్తోందన్నారు.

ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేయగా, చదువు పూర్తయిన పేద విద్యార్థులు చేతికందిన ఉద్యోగాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. నిధుల లేమితో ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడుతుంటే, అధ్యాపకులు రోడ్డున పడుతున్నా ప్రభుత్వానికి కనీస బాధ్యత లేకుండా పోయిందన్నారు.

ఉన్నత విద్యే కాకుండా పాఠశాలలు, గురుకులాల వ్యవస్థను సైతం కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా పేద విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, ఎడ్యుకేషన్ కిట్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. 

దీక్షకు అనుమతినివ్వని ప్రభుత్వం: రఘునందన్‌రావు

40 లక్షల మంది విద్యార్థుల గొంతుకగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పార్టీ కార్యాలయం ముందు దీక్ష చేస్తుంటే.. కనీసం అనుమతి ఇవ్వని ప్రభుత్వానికి అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించే నైతిక హక్కు సీఎంకు ఎక్కడుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. యూనివర్సిటీలు, కాలేజీల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక, పైచదువుల కోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదన్నారు.

ప్రస్తుత సమస్యను పరిష్కరించలేని రేవంత్‌రెడ్డి.. కేవలం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.2 వేల కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లి నిరసనలు చేస్తారు.. రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్లకు వెళ్తారు.. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తారు...కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాలు నడుస్తున్న తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల గురించి రాహుల్ గాంధీకి ఎందుకు పట్టడం లేదు? అని ప్రశ్నించారు.  

సీఎం రాజీనామా చేయాలి: ఎంపీ డీకే అరుణ

ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ... 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అంటూ అనేక హామీలు ఇచ్చారని బీజేపీ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ వ్యాఖ్యానించడం అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు. విద్యార్థులు ‘క్రిమినల్ వేస్ట్’గా మారుతున్నారని ముఖ్యమంత్రే అంటున్నారంటే.. వారికి నాణ్యమైన విద్య, అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయనే అంగీకరిస్తున్నట్టే అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.