పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
- నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి
- రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలి
- మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్‌పీ డి.వి. శ్రీనివాసరావు
మెదక్, ఆగస్టు 24 (విజయ క్రాంతి) : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించి, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించిన ఎస్పీ.. పెండింగ్ కేసులను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కేసులో ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి, నిందితులకు శిక్ష పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, చట్టపరంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఎస్పీ సూచించారు.
పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సానుభూతితో విని పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీసు సేవలు అందించాలని స్పష్టం చేశారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, పేకాట, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. క్రమశిక్షణ, సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచేలా పనిచేయాలని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎస్పీ వెంట డియస్పి ప్రసన్న కుమార్, సీఐ లు మహేష్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఎసై సుమన్, సిబ్బంది ఉన్నారు.






