రైతు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర పెంచాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం
పాల్వంచ, మే 25 (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు సరైన మద్దతు ధరలు కల్పించడంలో పాలకులు విఫలం చెందారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(AIKS) జిల్లా కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం విమర్శించారు.
వరి ధాన్యానికి మద్దతు ధర పెంచాలని, రైతుల వద్ద నుండి తక్షణమే పంటలు కొనుగోలు చేయాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎస్, సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాల్వంచలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామినాధన్ కమిటీ సిఫార్సులు తక్షణమే అమలు చేసి రైతాంగ, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరారు.
వ్యవసాయ రంగం బలంగా ఉంటేనే అన్ని రంగాలు బాగా ఉంటాయని తెలిపారు. పంటలు మద్దతు గ్యారెంటీ చట్టం అమలు చేస్తే తప్ప వ్యవసాయంలో రైతు నిలబడగలుగుతాడని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పది రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ పై విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు మూతపడి ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఇప్పుడు చమురు ధరలు పెంచడం వల్ల రవాణా రంగంపై పెనుభారం పడనుందని, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీసంశెట్టి పూర్ణచందర్రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్ పాల్గొన్నారు.






