13 April, 2026 | 2:26 AM

నీళ్లు.. నీళ్లు

13-04-2026 12:54 AM

వృక్షసైన్యం కూలిపోతుంటే 

కాలుష్యం కార్చిచ్చులా అంటుకొంటోంది

అమృతంలా జాలువారుతున్నా

భూమిలో ఇంకించే ఇంగితం కొరవడటంతో

జోరువానలు బోరుమంటున్నాయి

ఆనకట్టలు లేని కష్టాలు పడలేక

నదుల్లో నీరంతా సంద్రాన దూకి

మూకుమ్మడి ఆత్మహత్యలు చేసికొంటున్నాయి

మన చేష్టలకు పగబట్టిన భానుడి భగభగలకు

ఊరూరికి ఊరని నీరే ఉరై బిగుసుకుంటోంది

భూమండలమంతా తిరిగినా

స్వేదజలంతో తడవడం తప్ప గొంతు

తడుపుకొనే స్వచ్ఛజలం దుర్లభమవడంతో

రానురాను కన్నీరు మిగిల్చి 

మాయమవుతున్న నీరు

మన నిర్లక్ష్యాలకు నిలువెత్తు 

దర్పణమవుతున్న తీరు

మనిషి దురాశంత సముద్రాలుండి ఏం లాభం

దాహార్తి తీర్చే మానవత్వమంటి చెరువులు

చెలమలే నిత్యం శుభం

రేపటి కోసం నీటిని మూటగట్టకపోతే

చుక్క నీరు కోసం దార్లు తెలీని ఎడారుల్లో

సూరీడి వేసంగి చూపుల్లో తప్పించుకోలేక

వంట్లో నీరంతా అడియాసలా 

జావగారిపోతోంటే

వలసల తిప్పలు తప్పవు

అప్పుడిక మిగిలేది 

మనుషుల్లేని నెర్రలిచ్చిన నేలలే!

 భీమవరపు పురుషోత్తమ్