నగరం నెత్తిన చెత్త కొండ!
- ఐకియా సమీపంలో ఏడంతస్తుల ఎత్తులో పేరుకుపోయిన వ్యర్థాలు
- సుమారు 15 లక్షల టన్నుల మేర ఉంటాయని అంచనా
- పరిష్కారానికి రూ. 70 నుంచి రూ. 90 కోట్ల వరకు ఖర్చు
- ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం
- కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఏడంతస్తుల ఎత్తులో పేరుకుపోయిన చెత్త కొండ ఎక్కడుందో తెలుసా? నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే మార్గం, హైటెక్ హంగులతో మెరిసిపోయే గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లోనే దర్శనిస్తోంది. ఐకియా స్టోర్‌కు సమీపంలో, ఆకాశహర్మ్యాల మధ్య గుట్టలుగా పేరుకుపోయిన ఈ వ్యర్థాలు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెద్ద సవాల్‌గా మారాయి. అధికారుల అంచనా ప్రకారం పేరుకుపోయిన వ్యర్థాలు 15 లక్షల టన్నుల వరకు ఉంటాయని, వీటిని తొలగించడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
పదేళ్లుగా కొనసాగుతోన్న వ్యర్థాల డంప్
నగర పశ్చిమ మండలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం గచ్చిబౌలి ఐటీ కారిడార్. అదే స్థాయిలో నూతన నిర్మాణాలు, పునర్నిర్మాణాలు, కూల్చివేతలూ కొనసాగుతున్నాయి. వీటి నుంచి పెద్ద ఎత్తున వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి తోడు రోజువారీగా ఉత్పన్నమయ్యే చెత్త, ఇతర వ్యర్థాలను గచ్చిబౌలి మార్గంలోని ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తున్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, స్థానికులు ఈ ప్రాంతంలో పదేళ్ల నుంచి వ్యర్థాలను డంప్ చేస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాలుష్యమయం
గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాల వల్ల ఐకియా ప్రాంతమంతా కాలుష్యం వెదజల్లుతోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులతో పాటు స్థానికులు, ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించిన వ్యర్థాలను తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
పరిష్కారానికి ప్రణాళికలు
సమస్య పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడంతస్తుల మేర పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి రూ.70 నుంచి 90 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఏమంటున్నారంటే..
ఐకియా స్టోర్‌కు సమీపంలో ఖాళీ స్థలలాల్లోకి నాలుగు నుంచి ఐదు ప్రధాన పాయింట్ల నుంచి వ్యర్థాలు వచ్చి చేరుతున్నట్టు గుర్తించాం. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అయితే భూ వివాదాలు, పాలనాపరమైన అడ్డంకులు, శాస్త్రీయ అంచనా తదితర కారణాల వల్ల ప్రక్రియ జాప్యం జరిగే అవకాశం ఉంది.






