16 May, 2026 | 2:10 AM

అన్నదాతకు ‘మక్కల’ తిప్పలు..

16-05-2026 01:08 AM

రోడ్లపైనే రైతన్నల పడిగాపులు

ఆమనగల్లు, మే 15(విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి, అప్పులు తెచ్చి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలకు నరకప్రాయంగా మారింది. కల్వకుర్తి నియోజకవర్గంలో మొక్కజొన్న (మక్కల) కొనుగోళ్ల తీరు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి, ముందస్తు ప్రణాళిక లోపానికి అద్దం పడుతోంది. చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద, గోదాముల ముందు రోజుల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది.

అరకొర కేంద్రాలు.. తడిసిపోతున్న రవాణా ఖర్చులు....

కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఏడాది మొక్కజొన్న సాగు భారీగా పెరిగింది. అయితే, దానికి తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. నియోజకవర్గ మొత్తానికి కేవలం వెల్దండ మండల కేంద్రం, తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.దీంతో ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్, చారకొండ మండలాల రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. భారీగా పెరిగిన రవాణా ఖర్చులు రైతులకు అదనపు భారంగా మారాయి.

కిలోమీటర్ల మేర క్యూ.. గోదాముల వద్ద ’దిగుమతి’ జాప్యం..

కేంద్రాలలో ఎలాగోలా తూకాలు వేయించుకున్నా, ఆ తర్వాత అసలు నరకం మొదలవుతోంది. తూకం పూర్తయిన సరుకును ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి సమీపంలోని ఒక ప్రైవేట్ కాటన్ మిల్లు గోదాముకు తరలిస్తున్నారు.గోదాము వద్ద హమాలీల కొరత, దిగుమతి ప్రక్రియ మందగించడం వల్ల వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా దాదాపు ఒక కిలోమీటర్ మేర ట్రాక్టర్లు, లారీలు బారులు తీరాయి.  బస్తాలు దింపడానికి 4 నుండి 5 రోజుల సమయం పడుతుండటంతో, రైతులు రోడ్ల పక్కన చెట్ల కింద, ట్రాక్టర్ల కిందనే వంటలు చేసుకుంటూ, నిద్రిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

తేమ శాతం పేరుతో ఒకవైపు ధర తగ్గింపు 

తేమ పేరిటా ధర తగ్గిస్తున్నారు. మరోవైపు రోడ్లపై రోజుల తరబడి ఉంచడం వల్ల బరువు తగ్గుతోంది. మా కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నారని  ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానిక రైతులు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులు, అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండటంతో తెరిచిన ట్రాక్టర్లలో ఉన్న మొక్కజొన్న బస్తాలు ఎక్కడ తడిసి ముద్దవుతాయోనని రైతులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఒకవేళ వర్షం పడితే గింజ రంగు మారి, క్వాలిటీ దెబ్బతిని మద్దతు ధర కూడా దక్కదని వణికిపోతున్నారు.

అధికారులు ఇకనైనా స్పందించాలి..

అన్నదాతల కష్టాలు తీరాలంటే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు యుద్ధప్రాతిపదికన స్పందించాలి. కేవలం ఒకే మిల్లుపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. రైతులు రోడ్లపై పడుకునే దుస్థితిని దూరం చేసి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కల్వకుర్తి ప్రాంత రైతాంగం డిమాండ్ చేస్తోంది.