బాలసదనం చిన్నారులకు ఆత్మీయ ఆతిథ్యం
మేడ్చల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రక్షాబంధన్ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ప్రభుత్వ బాలసదనం బాలబాలికలు జిల్లా కలెక్టర్ మనుచౌదరి కి రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనుచౌదరి బాలసదనం పిల్లల కోసం ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేసి, వారికి స్వీట్లు, కొత్త దుస్తులను అందజేశారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి అవసరాలను తెలుసుకున్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం, సంక్షేమానికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ గారు తెలిపారు. పిల్లల విద్యాభ్యాసంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శారద , బాలక్ష భవన్ కోఆర్డినేటర్ తిరుమలాదేవి , జిల్లా చైల్ ప్రొటెక్షన్ అధికారి ఇంతియాజ్ రహీం తదితర అధికారులు పాల్గొన్నారు.






