28 July, 2026 | 2:05 AM

హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం

28-07-2026 01:22 AM

-బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, జూలై 27 (విజయక్రాంతి): హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన సోమవారం మాట్లాడుతూ చట్టాన్ని అమలుచేసే నెపంతో హైడ్రా అధికారులు ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్నారు. రాజకీయ కక్షసాధింపు కోసం ప్రభుత్వ పెద్దలు హైడ్రాను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ ముందు నుంచే చెబుతోందన్నారు. హైకోర్టు వ్యాఖ్యలతో తమ వాదనకు మరింత బలం చేకూరిందని చెప్పారు. నిబంధనలకు పాతర వేస్తూ పేద, మధ్యతరగతి వారిని సైతం హైడ్రా వేధించిందని గుర్తు చేశారు. అధికార దుర్వినియోగంపై హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడడం బాధాకరమన్నా రు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది పరాకాష్టగా అభివర్ణించారు. ఇప్పటికైనా రాజ్యాంగబద్ధమైన పారదర్శక పాలనను ప్రజలకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.