8 July, 2026 | 12:44 PM

SIR అంతా గందరగోళం

08-07-2026 11:31 AM
  1. ఫారాలు నింపడానికి ప్రజలకు తప్పని తిప్పలు
  2. పూర్తికావచ్చిన ఫారాల పంపిణీ
  3. బిఎల్ఓ లకు అవగాహన కరువు
  4. క్షేత్రస్థాయిలో తప్పని ఇబ్బందులు

మోతె, జూలై 8 విజయక్రాంతి: మోతె మండలంలో 29 గ్రామపంచాయతీలో బిఎల్ ఓ లకు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్న ఓటర్లు. బూత్ లెవల్ ఆఫీసర్(Booth Level Officer) బి ఎల్ ఓ లకు తగిన శిక్షణ, స్పష్టమైన మార్గదర్శకాలు అందించకుండానే క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ చేపడుతుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫారాలు తిరస్కరణకు గురికాకుండా ఎలా నింపాలి, ఏ ఆధారాలు జతచేయాలనే విషయాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిన్న చిన్న సందేహాలకు సరైన సమాధానాలు ఇచ్చేవారు కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శిక్షణ లేక ఇబ్బందులు

ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) సజావుగా సాగాలంటే బి ఎల్ ఓ లకు సమగ్ర శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి గ్రామంలో స్పష్టమైన సూచనలు, అవసరమైన పత్రాల జాబితా అందుబాటులో ఉంచితే బాగుండేది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు గందరగోళంగా ఉన్నాయి కొత్తగా వివాహమై అతగారింటికి వచ్చిన వారికి దరఖాస్తులు నింపడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బి ఎల్ ఓ లు గ్రామాలలో ప్రతి ఓటరు ఇంటిని మూడుసార్లు సందర్శించడం. ఎన్యుమరేషన్ ఫామ్ ను ఓటర్ నింపేలా చూడడం. ఓటరు స్థానికంగా లేకపోతే ఫోన్లు చేయాల్సి ఉంటుంది. మెజారిటీ గ్రామాలలో ఈ ప్రక్రియ సాగడం లేదు. దీంతో ఓటర్లు తమ ఓటు ఎస్ ఐ ఆర్ లో తొలగిపోతుందేమోననే ఆందోళన చెందుతున్నారు.

చాలా కుటుంబాలకు గ్రామాల లో ఓట్లు ఉండడం 2002 ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది. ఉదాహరణకు ఆమె వయస్సు 60 సంవత్సరాలు ఆమెకు 2002లో ఓటర్ లిస్ట్ లో పేరు కనిపించకపోవడంతో ఆ గ్రామంలో బిఎల్ఓ లకు ఆమె ఫారాని ఎలా నింపాలో తెలియక పంచాయతీ కార్యదర్శి కి సిఫారసు చేశారు. పంచాయతీ కార్యదర్శికి సైతం ఆ ఫారం ఎలా నింపాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అంటే బి ఎల్ ఓ లకు పంచాయతీ కార్యదర్శులకు (సర్) ప్రక్రియపై సరైన శిక్షణ లేకపోవడంతో ఫారాలు నింపే విషయంలో ఆందోళన చెందుతున్నారు. పై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.