ఓటర్ కార్డుల పంపిణీ వివాదం
- కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై కేసు నమోదు
వైరల్ వీడియో ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఇది రాజకీయ కుట్రేనని ఆరోపించిన నవీన్ యాదవ్
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 7 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం తొలిరోజే వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న కీలక నేత నవీన్ యాదవ్‌పై ఎన్నికల ప్రవర్తనా నియమావళి కోడ్ ఉల్లంఘన కింద కేసు నమో దైంది. నియోజకవర్గంలోని ఓటర్లకు ఆయన నేరుగా ఓటర్ ఐడీ కార్డులు పంపిణీ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్, ఆయన అనుచరులు కొందరు ఓటర్లకు నేరుగా ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డులను అందజేస్తున్నట్లు చిత్రీకరించిన వీడియో ఒకటి సోమవారం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై, కోడ్ అమల్లోకి వచ్చిన తరుణంలో ఈ వీడియో బయటకురావడంతో తీవ్ర కలకలం రేగింది.
ఈ వీడి యోను సుమోటోగా స్వీకరించిన ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఇది ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడ మేనని నిర్ధారించుకుంది. అనంత రం, ఫ్లయిం గ్ స్క్వాడ్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నవీన్ యాదవ్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు, జూబ్లీహిల్స్ పోలీసులు నవీన్ యాదవ్‌పై ప్రజా ప్రాతినిధ్య చట్టం మరియు భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇది రాజకీయ కుట్రే: నవీన్ యాదవ్
తనపై కేసు నమోదు కావడంపై నవీన్ యాదవ్ స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కుట్ర అని ఆయన ఆరో పించారు. తాను ఓటర్ కార్డులను పంపిణీ చేయలేదని, కేవలం కొత్తగా ఓటు నమోదు చేసుకున్న కొందరు స్థానికులు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడంలో సహాయం మాత్ర మే చేశానని ఆయన వివరణ ఇచ్చారు.
ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్‌కు తాను బలమైన పోటీదారుగా ఉండటంతో, తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఈ కుట్రకు తెరలేపాయని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ మరింత వేడెక్కింది. అధికార పార్టీ నేతపైనే కోడ్ ఉల్లంఘన కేసు నమోదు కావడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




