28 June, 2026 | 5:28 PM

పోలియో రహిత సమాజ నిర్మాణమే అందరి లక్ష్యం

28-06-2026 04:55 PM

బెజ్జంకి: పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆలయ మాజీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ అన్నారు. ఆదివారం బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా జెల్ల ప్రభాకర్ మాట్లాడుతూ... నిండు జీవితానికి రెండే చుక్కలు అనే నినాదాన్ని ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకోవాలని సూచించారు. పుట్టిన ప్రతి శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు.

ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని పోలియో బూత్‌లలో ఉచితంగా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.