జిల్లాల పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం హైదరాబాద్ లో పర్యటించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన నితిన్ నబీన్ కు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ ఎంపీలు, ఎమ్మేల్యేలు ఘన స్వాగతం పలికారు. జాతీయ అధ్యక్షుడు అయ్యాక ఆయన రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. అనంతరం నితిన్ రంగారెడ్డి గ్రామిణ జిల్లా బీజేపీ కార్యాలయంతో పాటు 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ ప్రజాపోరాటాలు చేయాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పోరాడాలని సూచించారు. ప్రజాసేవ, పోరాటాల ద్వారానే అధికారంలోకి రాగలుగుతామని, పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకోవాలని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ లో కార్యకర్తల సంకల్పం వల్లే ఘన విజయం సాధించామని, పశ్చిమబెంగాల్ స్ఫూర్తిగా తెలంగాణలోనూ పోరాడాలని ఆయన తెలిపారు.
త్వరలో తెలంగాణలోనూ కాషాయం జెండా ఎగరాలని, డబుల్ ఇంజినీర్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది. లోక్ సభలో 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోందని, ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మాస్వరాజ్ ఎంతో పోరాడారని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వల్లే తెలంగాణ కల సాకారమైందని నితిన్ నబీన్ వెల్లడించారు.






