28 August, 2026 | 5:40 AM

22 వేల కోట్ల అప్పు.. 6.5 కోట్లకు సెటిల్

28-08-2026 01:44 AM

మీడియా దిగ్గజ దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

సుభాష్ చంద్రకు మద్దతుగా ఓటింగ్‌లో 80.81 శాతం మంది రుణదాతల అంగీకారం

వ్యతిరేకించిన ఎల్‌ఐసీ రుణదాతలు

డబుల్ వసూలు చేసినా వేధింపులు తప్పట్లే..

భారత్‌లో ఒక్కొక్కరికీ ఒక్కోలా న్యాయం?: విజయ్ మాల్యా ఆవేదన

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రముఖ మీడియా (జీ గ్రూప్ వ్యవస్థాపకుడు దిగ్గజం సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.22,006.57 కోట్ల రుణాలకు రూ.6.5 కోట్లు చెల్లించి పరిష్కరించుకునేందుకు ‘జాతీయ కంపెనీ చట్టాల ట్రైబ్యునల్’ (ఎన్‌సీఎల్‌టీ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదించింది. ఈ కేసులో తొలుత ఎన్‌సీఎల్‌టీ డివిజన్ బెంచ్‌లోని ఇద్దరు సభ్యులు భిన్నమైన తీర్పునీయగా, అభిప్రాయబేధాల కారణంగా మూడో సభ్యుడు నీలేశ్ శర్మను నియమించారు.

ఆయన గురువారం మెజార్టీ రుణదాతల అభిప్రాయంపై ఓటింగ్ జరపగా 80.81 శాతం మంది రీపేమెంట్ ప్లాన్‌కు అంగీకరించారు. దీంతో నీలేశ్ శర్మ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆమోదం తెలిపారు. కాగా రికవరీ పరంగా చూస్తే మొత్తం బకాయిల్లో ఇది కేవలం 0.03 శాతం కావడం గమనార్హం. ఈ లెక్కన రుణదాతలకు 99.97 శాతం నష్టం వాటిల్లనుంది. సుభాష్ చంద్ర పర్సనల్ గ్యారంటర్‌గా ఉన్న ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రారంభించిన దివాలా ప్రక్రియలో భాగంగా ఈ ఆమోదం లభించింది. తమకు అంగీకరించిన క్లయిమ్ రూ. 1322.39 కోట్లు కాగా, ఎన్‌సీఎల్‌టీ ఆమోదంతో కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే అందుతుందని పేర్కొన్నారు.

విజయ్ మాల్యా ఆగ్రహం..

భారత్‌లో చట్టాలు, న్యాయం ఒక్కొక్కరికీ ఒక్కోలా పనిచేస్తున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతుందని కింగ్‌ఫిషర్ ఏయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. తాను చెల్లించాల్సిన ఉన్న అప్పు రూ.6,203 కోట్లకు గాను రూ. 14,100 కోట్లు చెల్లించినా తనను ఎగవేతదారుగా బ్యాంకులు, ప్రభుత్వం ప్రకటించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా భారతీయ రుణ పరిష్కార వ్యవస్థ అందించే న్యాయం అని నిలదీశారు. రెట్టింపు మొత్తాన్ని రాబట్టుకున్నా తనపై వేధింపులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఎన్‌సీఎల్‌టీ ఆమోదం లభించి నందుకు సుభాష్ చంద్రకు విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు. ఇప్పటికైనా తన విషయంలో ఆలోచించాలన్నారు.