26 June, 2026 | 3:33 AM

భారత ఐబీ చీఫ్‌గా మహేశ్ దీక్షిత్

26-06-2026 01:27 AM
  1. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం
  2. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి
  3. బలమైన నిఘా నెట్‌వర్క్‌కు పెట్టింది పేరు

న్యూఢిల్లీ, జూన్ 25 (విజయక్రాంతి): భారతదేశ అత్యున్నత గూఢ చారి సంస్థ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డైరెక్టర్‌గా మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. గురువారం కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ దీక్షిత్ నియామకానికి ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్‌లో అంతర్గత భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంలో, ప్రాంతీయ భద్రతా ముప్పులను పసిగట్టడంలో కీలకభూమిక పోషించారు.

బలమైన నిఘా వ్యవస్థ, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, నక్సలిజం, సరిహద్దు చొరబాట్లు వంటివాటిపై కీలకంగా వ్యవహరించారు. మహేశ్ దీక్షిత్ 1993 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఎక్కువకాలం ఐబీలో జాయింట్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉగ్రవాద నెట్‌వర్క్ కార్యకలాపాలను భగ్నం చేయడంలో దీక్షిత్ పేరుగాంచారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటాయి.

దీక్షిత్ విశిష్ట సేవలకు గాను 2016లో రాష్ట్రపతి పోలీస్ పతకం, 2009లో మెరిటోరియస్ పోలీస్ పతకం, 2004లో పోలీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ మెడల్ లభించింది. కాగా ప్రస్తుత ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ దేకా పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది. తదుపరి ఐబీ నూతన డైరెక్టర్‌గా మహేశ్ దీక్షిత్ బాధ్యతలను స్వీకరించనున్నారు.