27 July, 2026 | 5:55 PM

అప్పుల బాధతో వ్యాన్ డ్రైవర్ ఆత్మహత్య

27-07-2026 04:59 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్ (35) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఎస్ హెచ్ ఓ అన్వర్ సోమవారం తెలిపారు. మహేష్ వృత్తిరీత్యా వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడని, ఫైనాన్సులో వ్యాన్ కొనుగోలు చేసి, దాని ఈఎంఐ కట్టేందుకు కొంత మంది వద్ద అప్పులు చేశాడన్నారు. వ్యాన్ కుదవపెట్టి కొంతమంది దగ్గర, తన ఖర్చుల నిమిత్తం మరి కొంత మంది వద్ద ఇలా సుమారు రూ. 3 లక్షల వరకు అప్పు చేశాడన్నారు.

మూడు రోజుల కిందట తన భార్య అనారోగ్యంతో తల్లిగారింటికి వెళ్ళగా, మహేష్ ఆది వారం కిరాయికి వెళ్లి వచ్చి చేసిన అప్పులు తీర్చడం భారంగా భావించి మనస్థాపం చెంది ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. మహేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వనిత ఫిర్యాదు మేరకు ఎస్ హెచ్ ఓ అన్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.