27 July, 2026 | 5:46 PM

అభివృద్ధి పనులకు శిలాఫలకాలు, ప్రారంభోత్సవాలు

27-07-2026 05:00 PM

అశ్వాపురం, జులై 27 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో రూ.42 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం శిలాఫలకాలను ఆవిష్కరించి, మరో అభివృద్ధి పనిని ప్రారంభించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బీసీ హాస్టల్‌లో అభివృద్ధి పనులకు ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి రూ.30 లక్షలు మంజూరు కాగా, ఎమ్మెల్యే శిలాఫలకాలను ఆవిష్కరించారు. పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం చింతిర్యాల గ్రామపంచాయతీ పరిధిలోని కట్టంవారిగూడెంలో రూ.12 లక్షలతో నిర్మించిన నూతన అంగన్‌వాడీ భవనాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.