27 July, 2026 | 5:41 PM

ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి

27-07-2026 05:19 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఇల్లెందు మండలం  కొమరారం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలను గుర్తించినట్లు జిల్లా కమిటీ సభ్యుడు అబ్దుల్ నబీ, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ తెలిపారు. పాఠశాలలో ప్రహరీ గోడ దెబ్బతినడంతో పాటు హెడ్మాస్టర్, హిందీ పండిట్ పోస్టులు ఖాళీగా ఉండటంతో పదో తరగతి ఫలితాలపై ప్రభావం పడుతోందన్నారు. వెంటనే పూర్తిస్థాయి ప్రధానోపాధ్యాయుడు, హిందీ పండిట్‌ను నియమించాలని డీఈవోను కోరారు.

అనంతరం మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రొంపేడు గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి సమస్యలను పరిశీలించారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో 600 మందికి పైగా విద్యార్థినులు చెట్ల కింద, తాత్కాలిక షెడ్లలో భోజనం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో కోతుల బెడదతో పాటు చెట్లపై నుంచి క్రిమికీటకాలు ఆహారంలో పడే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే డైనింగ్ హాల్ నిర్మించాలని ఐటీడీఏ పీవోను కోరారు. సర్వేలో సీపీఎం నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్‌రావు, సుడిగాలి వెంకట నరసయ్య, ఎస్‌కే ఖాదర్, సత్యనారాయణ, కోరి సలీమా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.