ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
లేకుంటే ఆగ్రహానికి గురిగాక తప్పదు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, మే 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బషీర్‌బాగ్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శిగా గంజి ప్రసాద్‌కు నియామకపత్రం అందజేసి మాట్లాడారు. అనంతరం ఎంపీ కృష్ణయ్య మాట్లాడారు. నిరుద్యోగ యువత కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాక పెళ్లిళ్లు కూడా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఖాళీలు లేవంటూ ఉద్యోగ నోటిఫికేషన్‌లు వేయడం లేదని, రాష్ట్రంలో 4 లక్షలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే 18 వేల పోలీస్ శాఖలో ఉన్న ఉద్యోగాలు, 30 వేల టీచర్ పోస్టులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం ఏపీ అధ్యక్షులు నాగేశ్వర్ రావు, మహిళా ఇన్‌చార్జీ నూకాలమ్మ, తెలంగాణ నేతలు అనంతయ్య, రాజేందర్, జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.






