రాజకీయాల్లో అంటరానితనం పోవాలి
- కొన్నివర్గాల ఆధిపత్యమే చట్టసభల్లో కొనసాగుతుంది
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అర్హులను ఎలా గుర్తిస్తున్నారో చెప్పాలి
- 78 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో పెత్తనం లేని ప్రజాస్వామ్యం అందించాలి
- మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్రరావు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ రాజకీయ అవకాశాల్లో మాత్రం అందరికీ సమాన భాగస్వామ్యం దక్కడం లేదని మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని జపాన్ దాటేశామని ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇప్పటికీ కొన్ని కులాల వారు ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారని, ఇది ముమ్మాటికీ రాజకీయ అస్పృశ్యతగా పరిగణించాల్సిన అవసరం ఉందని పూర్ణచంద్రరావు అన్నారు.
ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీలు, మైనారిటీలు, చట్టసభల్లో జనాభా దామాషాలో ప్రాతినిధ్యం లేదని, ఎస్సీలు ఎస్టీలకు నామమాత్రపు రాజకీయ అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. ఎన్నోకులాల వారు చట్టసభల్లో ఇప్పటివరకూ కాలుమోపలేదని, ఆర్థిక, సామాజిక సమానత్వం లేనేలేదని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో కొన్నివర్గాల ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు. ఇది ప్రజాస్వామ్య భాగస్వామ్య సూత్రానికి విరుద్ధమని పేర్కొన్నారు.
దళితుల విషయంలో రాజ్యాంగ రక్షణలు ఉన్నప్పటికీ, సామాజిక, రాజకీయ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మాల, మాదిగ, క్రిస్టియన్లు, ఎస్సీ రిజర్వేషన్లకు అర్హులు కాదంటున్నారని, రెడ్డి, కమ్మలను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులను ఎలా చేస్తున్నారో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు, వర్గాలకు సమాన ప్రాతినిధ్యం అవసరం సూచించారు. రెండు, మూడు కులాలకు చెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు 50 శాతం ఉంటున్నారని, వారి జనాభా కేవలం 10 శాతం ఉంటుందని, శాతాన్ని మించి ఉండకుండా రిప్రెసెంటేషన్ కాప్ విధించేలా చట్టపరమైన మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఒకే వర్గ ఆధిపత్యాన్ని నిరోధించే విధానం కావాలి
చట్టసభల్లో, భూమిపంపిణీ, విద్యావకాశాల్లో కాప్ ఉండాలని పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. జర్మనీలో ఇదే విధానం అమల్లో ఉందన్నారు. దీనివల్ల చిన్నవర్గాలు కూడా ప్రాతినిధ్యం పొందుతాయని చెప్పారు. ఈ విధానం రాజకీయశక్తి సమానంగా పంచబడేలా చేస్తుందన్నారు. న్యూజిలాండ్‌లో మావోరి తెగ తమ సంస్కృతిని కాపాడుకుంటూ పార్లమెంట్‌లో వారి స్వరాన్ని స్పష్టంగా వినిపిస్తుందన్నారు.
బెల్జియం, ఫ్రెంచ్, డచ్, జర్మన్ ఇలా ప్రతి వర్గానికి నిర్దిష్ట భాగస్వామ్యం ఉంటుందన్నారు. ఇది ఒకేవర్గం ఆధిపత్యాన్ని సాధించకుండా నిరోధిస్తుందని చెప్పారు. దక్షిణాఫ్రికాలోనూ సమానత్వాన్ని స్థాపించేందుకు పార్టీలిస్ట్ అనుపాత ప్రతినిధిత్వ విధానాన్ని అమలు చేశారని చెప్పారు.78 సంవత్సరాల స్వతంత్ర భారత్‌లో పెత్తనం లేని ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించాలని పిలుపునిచ్చారు.
పాలనలో ప్రతివర్గం భాగస్వామ్యం కావాలని డాక్టర్ జె. పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ, సమతా సోషియో -ఎక నామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంట చక్రపాణి, ప్రొఫెసర్ పట్ట వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నిమ్మ నారాయణ పాల్గొన్నారు. సభలో ఎన్ సుశీల, మల్లేశం, రమణ నాయక్, యాదగిరి తమ అభిప్రాయాలను వెల్లడించారు.






