8 July, 2026 | 2:26 AM

ఆయిల్ పామ్ సాగు పెంచుతాం

08-07-2026 01:31 AM
  1. తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ చేస్తాం 
  2. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు 
  3. మలేషియాకు రైతుల అధ్యయన పర్యటనలు 
  4. ఆయిల్ పామ్ రైతులతో కేటీఆర్

హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి, జూలై 7 (విజయక్రాంతి): 2028లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంచుతామని, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అధికారంలోకి రాగానే రైతులకు మరిన్ని ప్రోత్సాహకా లు అందిస్తామని, మలేషియాకు రైతుల అధ్యయన పర్యటనలు చేపడతామని చెప్పారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో కేటీఆర్ సమావేశమై వారి సమస్యలు, అనుభవాలు, సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలన్నది మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో రూపొందించిన లక్ష్యమని తెలిపారు.

మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేసి దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే కాకుండా, రైతులకు వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చేలా చేయడమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా ఈ పంటకి ప్రోత్సాహాన్ని అందించామని వివరించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో సుమారు లక్షన్నర ఎకరాల్లో మాత్రమే ఉన్న ఆయిల్ పామ్ సాగు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల ఎకరాలకు విస్తరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం కొనసాగితే అది ఏడు లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయిల్ పామ్ రైతులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.

ట్రాక్టర్లు, స్లాషర్లు వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై అధిక సబ్సిడీలు అందించి యాంత్రీకరణను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. పంట పూర్తిస్థాయిలో ఎదిగిన తర్వాత అవసరమయ్యే రెండో దశ డ్రిప్ ఇరిగేషన్ లైన్ల ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని చెప్పారు.

అంతేకాకుండా ప్రపంచ స్థాయి ఆయిల్ పామ్ సాగు పద్ధతులను రైతులు ప్రత్యక్షంగా అధ్యయనం చేసేలా మలేషియాకు ప్రత్యేక అధ్యయన పర్యటనలను నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. అక్కడి ఆధునిక సాగు విధానాలు, యాంత్రీకరణ, నీటి వినియోగ పద్ధతులను పరిశీలించి తెలంగాణలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపైనా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

కాళేశ్వరం వినియోగంలో ప్రభుత్వం విఫలం..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తూ రైతుల పంటలను ఎండబెడుతున్నారని విమర్శించారు. ‘ఇంట్లో ఒక చోట చిన్న లీకేజీ వచ్చిందని మొత్తం ఇంటినే కూల్చేస్తారా?‘ అని ప్రశ్నించిన కేటీఆర్, మేడిగడ్డ బ్యారేజీలో ఒక భాగంలో సమస్య తలెత్తిందనే కారణంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టడం రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందన్నారు. వెంటనే కన్నెపల్లి పంపుహౌస్‌ను ప్రారంభించి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని, నిలువ పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.