అందని ద్రాక్షలా సర్కార్ విద్య!?
- అందని ద్రాక్షగా మారిన ప్రభుత్వ విద్య
- సదుపాయలేక కునారిల్లుతున్న ప్రభుత్వ బడులు
- మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లావ్యాప్తంగా సమగ్ర శిక్షణ సామాజిక తనిఖీలు
- జిల్లా వ్యాప్తంగా 136 పాఠశాలల పరిశీలన
సుజాతనగర్ ,జూలై 7, ( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించినంత ఫలితాలు రావడంలేదని మేధావి వర్గం ఆరోపిస్తుంది.
అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక వినూత్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పాలకుల, అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిటీ శాపంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చాలినంతమంది విద్యార్థులు లేక, సరిపడా ఉపాధ్యాయులు కరువై నాణ్యమైన విద్యా బోధన జరగటం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు సౌకర్యాల లేమి ప్రభుత్వ పాఠశాలల్లో కత్తి మీద సాముల నిర్వహిస్తున్నారు.
సమస్యలు కోకొల్లలు...
నేను రాను బిడ్డో ప్రభుత్వం పాఠశాలలకు.. అనే చందంగా ప్రతి ఏడాది విద్యా సంవత్సరంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే ఆరోపణలు సర్వసాధారణమయ్యాయి.
విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక ప్రహరీ గోడలు మరుగుదొడ్లు, చాలీచాలని బోధన సిబ్బంది అసౌకర్యాల నిలయంగా మారాయి. తాగునీరు విద్యుత్తు క్రీడా పరికరాల సామాగ్రి అరకొరగా కల్పిస్తూ చేతులు దులుపుకోవడంతో ప్రభుత్వ పాఠశాలలుఅనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి.
పాఠశాలలలో సమగ్ర శిక్షణ సామాజిక తనిఖీలు
సమస్యలతో స్వాగతిస్తున్న పాఠశాలల స్థితిగతులను అంచనా వేస్తూ విద్యార్థులకు అవసరమయ్యే సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగు ముందుకు వేశాయి. అందుకు అనుగుణంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత నెల 23 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారం వరకు పూర్తి చేసేందుకు సమగ్ర శిక్ష సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఎంపిక కాబడిన 136 ప్రభుత్వం ఉన్నత పాఠశాలలు కస్తూరిబా విద్యాలయాలలో ఈ తనిఖీలను సామాజిక బృందం చేపట్టింది.
సామాజిక తనిఖీలలో సమస్యలు తీరేనా...?
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాలలలో సమగ్ర శిక్ష సామాజిక తనిఖీల ద్వారా గుర్తింపబడిన అనేక సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి వెళుతుండడంతో ఈ ఏడదైనా విద్యార్థులకు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
ఈ తనిఖీలలో ప్రధానంగా పాఠశాలల స్థితిగతులు మధ్యాహ్న భోజన నిర్వహణ, నాణ్యమైన విద్యాబోధన, మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది కొరత, అందుబాటులో క్రీడా సామాగ్రి, పాఠశాలల పరిరక్షణకు పారి గోడలు, విద్యార్థులకు ప్రత్యేకమైన మరుగుదొడ్లు , తాగునీరు విద్యుత్ సౌకర్యం తదితర సమస్యలను గుర్తించి సామాజిక నివేదికలు పాఠశాల పరిస్థితులపై ప్రభుత్వానికి తెలియజేసేందుకు సమగ్ర శిక్ష సామాజిక తనిఖీలు సంపూర్ణంగా ఉపయోగపడుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






