8 July, 2026 | 3:05 AM

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ

08-07-2026 02:11 AM
  • రాముడి హుండీకే శఠగోపం
  • పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ
  • యువతతోనే సమాజ మార్పు
  • సిపిఐ శిక్షణా తరగతుల్లో జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ

భారతీయ జనతాపార్టీ రాజకీయ పార్టీలను విభజించి లబ్ది పొందే ప్రయత్నంలో ప్రజాస్వామ్యాన్ని అవహాస్యం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. 2004 ఎన్నికల్లో 300 సీట్ల కోసంప్రయత్నం చేసి భంగపడ్డ బిజేపి దేశంలోని రాజీయ పార్టీలను చీల్చి ప్రజాభిప్రాయాన్ని ప్రక్కనపెట్టి పార్లమెంట్లో ఆదిపత్యాన్ని పెంచుకునేందుకు యంపర్లాడుతోందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కౌన్సిల్ సభ్యుల స్థాయి రాజకీయ సైద్దాంతిక శిక్షణా తరగతులు మంగళవారం భద్రాచలంలో ప్రారంభమయ్యాయి.

ఈ తరగతులకు ముందు పార్టీ పతాకాన్ని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు ఆవిష్కరించారు. శిక్షణా తరగతులను ప్రారంభించిన రామకృష్ణ, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో విపక్షాలను చీల్చే ప్రయత్నం చేస్తూ కాశాయం పార్టీ వికృత క్రీడకు తెరలేపిందన్నారు. బెంగాళ్ లో బిజేపీ వ్యవహరించిన తీరు ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు.

బిజేపి అధికారంలోనికి రావడానికి కారణమైన రామానామాకే చివరకు శఠగోపంపెట్టే పరిస్థితి తీసుకొస్తోందన్నారు. అయోధ్య రామాలయంలో సుమారు రూ.1400 కోట్లను బిజేపి అనుబంధ సంస్థలైన విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ దారిమళ్లించాయని, దీనిపై మోడి సమాధానం చెప్పాలన్నారు.

దేశవ్యాప్తంగా రూ.3624 కోట్ల విరాళాలు వచ్చాయని చెబుతున్న మత సంస్థలు దారితప్పిన నిధులపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు.  బిజేపీ ఈ 12 ఏళ్ల కాలంలో ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని, ధరలు, నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్నాయని , తెస్తానని చప్పిన బ్లాక్ మని తీసుకురాలేదని, దేశంలోని అవినీతిని అరికడతానని అధికారంలోనికి వచ్చిన మోడి ఘోరంగా వైఫల్యం చెందారన్నారు.

మార్పు తధ్యం :

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల అవసరాలను గుర్తించి పాలన చేయని వారిని గద్దె దింపుతున్నారని, ఇందులో యువత ప్రధాన పాత్రపోషిస్తోందన్నారు. ప్రస్తుత తరం మార్పు కోరుకుంటోందని తెలిపారు. ఇటీవల దేశంలో కాక్రోచ్ జనతాపార్టీకి వచ్చిన స్పందన తమిళనాడులో టివికే గెలుపు ఇవన్నీ మార్పులను సూచిస్తున్నాయన్నారు.

కొత్తగూడెంలో ఒక సానుకూల పరిణామం తొలి మేయర్ గెలిచేందుకు కారణమైందని, అలాంటి పరిస్థితులే దేశంలో పునరావృతం కానున్నాయన్నారు. పెరిగిన నిరుద్యోగం , అవినీతి ఆర్థిక అంతరాలు రానున్న కాలంలో మార్పుకు దారితీస్తాయని ఆయన తెలిపారు.

నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో లో వచ్చిన పరిణామాలు భారత్లో కూడా రానున్నాయన్నారు. యువత విద్యార్థులను ఆకర్షించడం ద్వారా ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాధం, జమ్ముల జితేందర్ రెడ్డి, కల్లూరి వెంకటేశ్వరరావు, ఎర్రా బాబు, నరాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.