8 July, 2026 | 2:59 AM

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణను పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలి

08-07-2026 02:09 AM

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్

మధిర, జూలై 7 (విజయ క్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధిర పట్టణంతో పాటు ఎర్రుపాలెం మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ... ప్రతి బీఎల్‌ఓ తప్పనిసరిగా బీఎల్‌ఓ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే వివరాలను నమోదు చేయాలని, సమాచార నమోదులో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితానే మూలాధారం అని, అందులో ప్రతి ఓటరు వివరాలు తప్పుల్లేకుండా నమోదు కావడం అత్యంత కీలకమని ఆయన అన్నారు.

ప్రతి నమోదు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, డేటా నమోదు, ధృవీకరణ ప్రక్రియలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.  అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి, పూర్తి చేసిన ఫారాలను నిర్దేశిత గడువులోగా తిరిగి స్వీకరించి డిజిటైజేషన్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరూ మిగిలిపోకుండా ప్రతి కుటుంబాన్ని చేరుకోవాలని, సర్వే ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండరాదని సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ సమయంలోనే ఓటర్లకు ఎదురయ్యే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని, తప్పుడు ప్రచారం లేదా అపోహలకు ఆస్కారం లేకుండా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పారదర్శకమైన, విశ్వసనీయమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పనలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా చురుకుగా భాగస్వాములు కావాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా సహకరించాలని ఆయన కోరారు.

అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే నాణ్యమైన ఓటరు జాబితా సిద్ధమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, మధిర మండల తహసీల్దార్ రాంబాబు, ఎర్రుపాలెం మండల తహసీల్దార్ సునీత ఎల్జిబెత్, మధిర మున్సిపల్ కమిషనర్, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.