8 July, 2026 | 2:27 AM

నా శాఖతో ఆయనకేం పని!

08-07-2026 01:28 AM
  1. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ గుర్రు! 
  2. దేవాదాయశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షిస్తారా? 
  3. ఆ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వలేరా? 
  4. నా మంత్రిత్వశాఖ పరిధిని బేఖాతరు చేస్తారా? 
  5. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడండి 
  6. పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి చర్యలు తీసుకోండి 
  7. సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

హైదరాబాద్, జూలై 7(విజయక్రాంతి): స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, దేవాదాయశాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించడంపై ఆ మంత్రి కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలు, మంత్రిగా తన అధికార పరిధిని బేఖాతరు చేశారని పేర్కొన్నారు.

ఈ విషయమై విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటలను జరగ కుండా చర్యలు తీసుకోవాలంటూ ఆమె సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ ద్వారా ఫిర్యా దు చేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన, విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ తదితర అంశాలు సంబంధిత శాఖ మంత్రి పరిధిలోకి వస్తాయని మంత్రి కొండా సురేఖ తన ఫిర్యాదు లేఖలో స్పష్టం చేశారు.

అయినప్పటికీ, ఆ శాఖ మంత్రినైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్‌తో పాటు శాఖ అధికారులను సమావేశపరచి పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, అధికారులకు గడువులు నిర్దేశించడం వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించడం పరిపాలనా పరంగా అభ్యంతరకరమని పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యనిర్వహణ నియమాల స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని అన్నారు. శాఖా పరిపాలనకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు సంబంధిత శాఖా మంత్రి ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉం టుందనే విషయం ప్రజా జీవితంలో అనుభవజ్ఞులైన ప్రతి ప్రజాప్రతినిధికి విధితమేనని, అలాంటి పరిస్థితుల్లో ఆ శాఖ మంత్రిని పూర్తి గా పక్కనపెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సం ప్రదాయానికి దారితీస్తుందని మంత్రి తన లేఖ లో స్పష్టం చేశారు.

భవిష్యత్తు లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.