తాడిచర్ల బ్లాకును కేటాయించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు
- ప్రజా ప్రభుత్వ కృషితోనే సాధ్యమైంది
- మరో 40 ఏళ్ల పాటు మైనింగ్‌కు అవకాశం
- 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు వెలికితీసే అవకాశం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): సింగరేణి అభివృద్ధిని కోరుతూ కొత్త గనులు సాధించాలని తాము చేసిన నిర్విరామ కృషి ఫలించిందని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న తాడిచర్ల -2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. తాడిచర్ల -2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని 7 మార్చి 2024న అప్పటి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని న్యూఢిల్లీలో తాను కలిసి కోరినట్టు గుర్తు చేశారు. అదే ఏడాది జూన్‌లో హైదరాబాద్‌లో కేంద్రం నిర్వహించిన బొగ్గు బ్లాక్‌ల వేలంలో ప్రస్తుత బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు. అదే ఏడాది నవంబరులో కూడా మరోసారి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
అలాగే స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి న్యూఢిల్లీలో ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. గత మే నెలలో కూడా ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించి తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారని చెప్పారు. ప్రజా ప్రభుత్వ విజ్ఞప్తులకు స్పందించి సింగరేణికి తాడిచర్ల బ్లాక్ను కేటాయించడానికి అంగీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
‘ఈ గనిలో 434.14 మిలియన్ టన్నుల నిల్వలు ఉండగా వీటిలో 340 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ‘ఇక్కడ మేలైన జీ-9 రకం బొగ్గు లభించనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సింగరేణి సంస్థ 100 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ఇది కూడా దోహదపడనుంది’ అని భట్టి పేర్కొన్నారు.






