30 May, 2026 | 2:07 AM

నిండు వేసవిలో కురిసిన అకాల వర్షాలు.. పొంగి పొర్లిన పెద్ద వాగు

30-05-2026 12:00 AM

ఇరు గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం 

ప్రజల కష్టాలు పట్టని పాలకులు

అలంపూర్, మే 29: రోహిణి కార్తీ వస్తే రోళ్ళు కూడా పగులుతాయి అన్న పెద్దల నానుడి.. కార్తీ ప్రారంభమై రెండు రోజులు గడిచింది..నిండు వేసవికాలం... పగలంతా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు.. ఉన్నట్టుండి వాతావరణంలో జరిగిన ఆకస్మిక మార్పులు...దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులకు చెట్లు పడ్డాయి మరికొన్నిచోట్ల.. వాగులు వంకలు పొంగిపొర్లాయి.

పిడుగుపాటుకు గురై కోడెద్దులు మృతి చెందాయి. గద్వాల జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలం రాకముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే నిండు వర్షాకాలంలో వర్షాలకు మరి ఎలాంటి పరిస్థితి దాపురిస్తుందో అన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు.వేసవికాలం లో కురిసిన అకాల వర్షాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద వాగు పొంగిపొర్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి.

అలంపూర్ నియోజకవర్గం లోని వివిధ గ్రామాల్లో బ్రిడ్జిలపై వర్షపు నీరు వరదల పారింది. ముఖ్యంగా  అమరవాయి నుంచి మానవపాడు మండల కేంద్రానికి  ఉన్న ప్రధాన రహదారి నీట మునిగిపోవడంతో ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టుకు ని నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ పనుల కోసం వెళ్లే గ్రామ స్తులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు తలపై సామా న్లు మోసుకుంటూ నీటిలో నడుస్తుండగా, మరికొందరు చిన్నపిల్లలను ఎత్తుకుని వాగు దాటుతున్నారు.

వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గ్రామాలు దాదాపు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. స్థానికులు పలుమార్లు వంతెన నిర్మాణం కో సం అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ప్రజా సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే సమస్య ఎదురవుతున్నా శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తు న్నారు. వాగుపై వంతెన నిర్మించి ప్రజ ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.