18 July, 2026 | 1:24 AM

‘పెద్దవాగు’ను మరిచారా?

18-07-2026 01:13 AM
  1. రెండేళ్లుగా గండి పూడ్చని ప్రభుత్వం
  2. గోదావరిలో వృథాగా కలుస్తున్న లక్షల క్యూసెక్కుల జలాలు
  3. తెలంగాణలో ప్రాజెక్టు.. ఆయకట్టు మాత్రం ఏపీలో అధికం   
  4. నిధులు, నిర్ణయాలు లేక అయోమయం
  5. ఈ సీజన్‌లోనూ అనిశ్చితే..  
  6. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ స్పందించాలంటూ విజ్ఞప్తులు

అశ్వారావుపేట, జూలై 17 (విజయ క్రాంతి): రెండేళ్ల క్రితం వరదలకు దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్టు గండి ఇప్పటికీ పూడ్చలేదు. కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు నిర్వీర్యంగా మారగా, లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి.  ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నప్పటికీ, అత్యధిక ఆయకట్టు ఆంధ్రకు తరలివెళ్లటం ప్రాజెక్టు పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా రైతులకు సాగులేరు అందక సాగు భూములు బీడు వారుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి వద్ద  1976లో నిర్మించిన ఈ మధ్యతరహా ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతోంది. అప్పట్లో ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఆశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ప్రాజెక్టు ఆయుకట్టు విస్తరించి ఉండగా. రాష్ట్ర విభజన సమయంలో కేవలం 2వేల ఎకరాలు అశ్వారావుపేట మండలంలో మిగిలింది. మిగితా 14వేల ఎకరాలు పోలవరం ముంపు ప్రాంతాలుగా ఏపీలోకి వెళ్లాయి.

వేలేరుపాడు మండలంలో 7వేల ఎకరాలు, కుక్కునూరు మండలంలో 7 వేల ఎకరాల ఆయుకట్టు చేరిపోయింది. అంటే ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా, మేజర్ ఆయకట్టు ఏపీలోకి వెళ్లింది. అప్పటి నుంచే ఈ ప్రాజెక్టుకు దుర్గతి పట్టింది. రాష్ట్ర విభజనతో ప్రాజెక్టు నిర్వహణ అయోమయంగా మారింది. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న ఈ ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా పట్టించుకోలేదు.

2024లో భారీ గండి

దశాబ్దకాలం పాటు ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోక. అటు ఏపీ నుంచి సహకారం ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్రాల సమస్యగా మిగిలిన ఈ ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పట్టించుకోలేదు. పెద్దవాగు ప్రాజెక్ట్ ఉందన్న సంగతి గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు..

మర్చిపోయిందా? అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలైలో కురిసిన భారీ వర్షానికి పెదవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడి నేటికి రెండేళ్లయింది. గుమ్మడపల్లి, కొత్తూరు గ్రామాలు నీట మునిగాయి. ఏపీ, తెలంగాణాలోని వేలాది ఎకరాల పంటలు ముంపునకు గురయ్యాయి. వరి పొలాలు, చేలల్లో ఇసుక మేటలు వేశాయి. 

అనంతరం తెలంగాణలోని భూములకు తాత్కాలికంగా సాగునీరందించాలనే ఉద్దేశ్యంతో రూ.3 కోట్లు వెచ్చించి ప్రాజెక్టు లోపల రింగ్ బండ్ నిర్మించారు. 2025 వర్షాకాలం నాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటామని చెప్పింది.

మరమ్మతులు, కాలువల నిర్మాణంకోసం రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. ఇరు ప్రభుత్వాల ఆమోదంకోసం ప్రతిపాదనలు కూడా పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ తరువాత ఫైల్ అనుకున్నంత వేగంగా కదలకపోవడంతో రైతులు గత సీజన్‌ను కోల్పోయి మళ్లీ వానాకాలం సీజన్ వచ్చేసింది.

సాంకేతిక అనుమతులు పెండింగ్?

ప్రాజెక్టు గండి మరమ్మతుల కోసం పరిపాలన మంజూరు తప్ప ఆర్థిక, సాంకేతిక అనుమతులు రాలేదని తెలుస్తోంది. ఇప్పటికే రెండు పంటలు కోల్పోవడం ద్వారా వేలాది మంది రైతులు రూ.కోట్లలో నష్టపోయారు.వచ్చే యాసంగి సీజన్‌కైనా అందుబాటులోకి వస్తుందో లేదో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్ర విభజన పెదవాగు ప్రాజెక్టుకు ముప్పునుతెచ్చి పెట్టగా, వేలాది రైతులకు నష్టాన్ని  మిగిల్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. గత సీజన్‌లో గండిని పూడ్చకపోవడంతో లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా గోదావరిలో కలిసింది. ఇప్పటికైనా  అధికారులు స్పందించివచ్చే  నాటికి ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని ఆయుకట్టు రైతులు కోరుతున్నారు.