మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్
భవన నిర్మాణానికి రూ. 20 కోట్లు మంజూరు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు
హైదరాబాద్/పెద్దపల్లి, జూలై 17 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కేంద్ర భవన నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల (టీఆర్‌బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ రంగానికి అవసరమైన అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనున్నది. నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను యువత అందిపుచ్చుకునేలా అంతర్జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ ఇక్కడ లభించనున్నది. స్వల్ప, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణార్థులకు స్వయం ఉపాధితోపాటు ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
ఈ ప్రతిష్ఠాత్మక న్యాక్ సెంటర్‌ను మంథనికి కేటాయించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్మాణ రంగంలో ఉత్తర తెలంగాణ యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణను అందించడంతోపాటు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా ఈ కేంద్రం వారధిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా మంథని ప్రాంత యువతకు అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ భవన పనులను త్వరలోనే ప్రారంభించి, వీలైనంత వేగంగా యువతకు అందుబాటులోకి తెస్తామని శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. మంథని ప్రాంత రూపురేఖలను మార్చేలా ఐటీ, పరిశ్రమలతోపాటు ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీసుకురావడం పట్ల స్థానిక ప్రజలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.






