18 July, 2026 | 12:49 AM

వైద్యం, విద్యే ప్రగతికి పెట్టుబడి

18-07-2026 12:49 AM
  1. వైద్య, విద్య, ఉద్యోగ రంగాల్లో విప్లవాత్మక మార్పులు
  2. రికార్డు స్థాయిలో 76 వేల పోస్టులు భర్తీ  
  3.   44 వేలకు పైగా పడకల సామర్థ్యంతో దేశంలోనే అగ్రగామిగా వైద్యరంగం
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి) : వైద్యం, విద్యపై ప్రభుత్వం పెట్టే  ఖర్చు ఉచిత సంక్షేమం మాత్రమే కాదని, అది రాష్ట్ర స్థూల ఉత్పత్తిని  పెంచేందుకు మానవ వనరులపై పెట్టే దీర్ఘకాలిక పెట్టుబడి అని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ మెడికల్  సర్వీసెస్  డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు శుక్రవారం హైదరాబాద్ సేవాలాల్ భవన్‌లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి  నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో కార్మికులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని, హక్కులు, కనీస వేతనాలకు నోచుకో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతం లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశంలోనూ కనీస వేతనాల సవరణ గురించి నిలదీశానని, కానీ నాటి ప్రభుత్వం ఏనాడూ సరైన సమాధానం ఇవ్వలేదని గుర్తు చేశారు.

అయితే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన వెం టనే ప్రత్యేక దృష్టి సారించి, దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను సాధించి జీవోలను విడుదల చేశారని కొనియాడారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో మందుల కొరత ఉండకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని గ్రీన్ ఛానల్‌లో 30 కోట్లు  విడుదల చేయడానికి వెసలుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నా ణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం గా ఈఎస్‌ఐ ఆసుపత్రుల రూపురేఖలను మార్చబోతున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా డయాలసిస్ యూనిట్లు, సీటీ స్కా న్, బర్న్స్ వార్డులు, కార్డియాక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి, సౌకర్యాలను ఆధునీకరి స్తున్నట్లు తెలిపారు.

వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది కొరతను అధిగమిస్తామని, 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఆరుగురు డెంటల్ సివిల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్‌ఎంలు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రికార్డు స్థాయిలో 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. 

ప్రతి ఒక్కరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం

రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రితో పాటు ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేయడానికి ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నామని చెప్పారు. నిమ్స్ విస్తరణ పనులకు సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 44,029 పడకల సామర్థ్యంతో దేశంలోనే అత్యధిక సగటు పడకలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీ సెస్  ద్వారా దాదాపు 75 లక్షల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 16 మెడికల్ కాలేజీలకు అదనంగా నూతనంగా 9 మెడికల్ కాలేజీలను, 16 నర్సింగ్ కాలేజీలను, 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తూ, సేవలను ప్రజల చెంతకు చేర్చడంలో ప్రభుత్వం వెనకడుగు వేయబోదని డిప్యూటీ సీఎం భట్టి పునరుద్ఘాటించారు.