ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి జానీ మాస్టర్ బహిష్కరణ
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేటు వేసింది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా, సంస్థ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనను ఆల్ ఇండియా స్థాయిలో ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి బహిష్కరిస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జానీ మాస్టర్ యూనియన్ సభ్యులను రెచ్చగొట్టే విధం గా మాట్లాడారని, ఆయన ప్రవర్తన సంస్థ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా జూలై 14న జరిగిన అంతర్గత విచారణకు హాజరుకావాలని ఫెడరేషన్ జానీ మాస్టర్‌ను ఆదేశించింది. అయితే, ఆయన ఈ విచారణకు హాజరు కాకపోవడాన్ని ఫెడరేషన్ బాధ్యులు తప్పుబట్టారు.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు గాను, రాబోయే 7 రోజుల్లోగా దీనిపై పూర్తిస్థాయి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ వర్గాలకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కఠిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జానీ మాస్టర్‌పై బహిష్కరణ వేటు వేసిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఆయన కొరియోగ్రఫీ చేసే ఏ సినిమాకైనా, ప్రాజెక్టుకైనా ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహకారం అందించబోమని స్పష్టం చేశారు. ఫెడరేషన్ మళ్లీ తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ సహాయ నిరాకరణ దేశవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రకటించింది. మరోవైపు డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్య క్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసోసియేషన్ జనరల్ బాడీ తీసుకునే నిర్ణయాలకు అంతా కట్టుబడి ఉండాలని సూచించింది.
నిర్మాతలు సహకరించాలి: జానీ మాస్టర్
మరోవైపు డీఎఫ్‌టీడీడీఏ మాజీ అధ్యక్షుడు జానీ మాస్టర్ నిర్మాతల మండలికి ఓ లేఖ రాశారు. తమ డాన్సర్స్ ఫెడరేషన్ పెద్దల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. కొంతమంది ప్రోగ్రాం ఇన్‌చార్జీలు ప్రొడక్షన్ కంపెనీకి పెడుతున్న అక్రమ బిల్లులను పరిశీలించి, అవినీతికి పాల్పడిన వారిని సస్పెండ్ చేస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. నిర్మాతలను మోసం చేస్తున్న వారిని చూసీ చూడనట్లు పోవాలని ఫెడరేషన్ పెద్దలు మాట్లాడుతున్నారని, వారి దుష్ర్పచారాన్ని నమ్మొద్దని కోరారు. యూనియన్ ఉప ఎన్నికలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






