17 June, 2026 | 5:06 AM

అందరికీ ఓటు హక్కు అంబేద్కర్ పుణ్యమే..

17-06-2026 02:45 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

కొమురవెల్లి, జూన్ 16: ధనిక బీద తేడా లేకుండా, లింగ వివక్ష తేడా చూపకుండా, కుల మతాలకు అతీతంగా  అందరికీ ఓటు హక్కు ప్రసాదించింది అంబేద్కరేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని రాంసాగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టపన మహోత్సవంలో మంగళవారం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

ఆయన చూపిన బాటలోనే దళితుల సంక్షేమం సాధ్యమన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని, అమరుల చిహ్నాలను చూస్తూ పాలకులు నిరంతరం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేయాలని, ప్రజలు వారిని నుండి నిత్యం స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. విగ్రహాలను ప్రతిష్టించుకోవడమే కాదు, మహాశయులల జీవిత చరిత్రను తెలుసుకొని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఆయన అందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సమాజంలో ఎక్కడికి వెళ్ళినా అత్యంత బీదరికంలో మగ్గుతుంది దళితులేనని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతోనే కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పూర్తిస్థాయిలో అందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేసిందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు కు కృషిచేసిన కమిటీ సభ్యులను, ప్రజా ప్రతినిధులను దళిత నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అక్కనపెల్లి  రాజ్యలక్ష్మి, బొచ్చు రాజు యాదవ్,  నాయకులు గీస బిక్షపతి, సిల్వర్ సిద్ధప్ప, పచిమడ్ల స్వామి గౌడ్  తదితరులు పాల్గొన్నారు.