19-02-2026 03:01:19 AM
జాతీయ భద్రతకు కాంగ్రెస అగ్రనేత ప్రమాకరం
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: భారత వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ పర్యటనల సమయంలో ఆయన వేర్పాటువాదులు, మావోయిస్టులు, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జిసోరస్ లాంటి వ్యక్తులతో సమావేశమవుతున్నారని తెలిపారు.
దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధమవడంపై కూడా రిజిజు మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రాహుల్‌గాంధీ వారి వ్యాఖ్యలతో చర్చలకు అంతరాయం కలిగిస్తారని అన్నారు.
దేశ చరిత్రలో ఎప్పుడూ ఆయనలాంటి ప్రతిపక్ష నేతను చూడలేదని రిజిజు విమర్శించారు.పార్లమెంట్ సమావేశాలు జరగనీయకూడదనే ఉద్దేశంతో కాగితాలు విసిరేయడం, నినాదాలు చేస్తూ వాకౌట్ చేయడం వంటి చిన్న పిల్లల చర్యలు చేస్తుంటారని అసహనం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ ఇలా సభకు అంతరాయం కలిగించడం వల్ల ప్రజల సమస్యల గురించి మాట్లాడాలనుకునే వారికి అవకాశం దక్కట్లేదని చెప్పారు.
మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పరిణతి చెందిన నాయకులు ఉండేవారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పార్టీ కేవలం రాహుల్ గాంధీ చుట్టూనే తిరుగుతోందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ క్రమంగా పతనమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ల్లోని నేతలందరూ రాహుల్ గాంధీ బాటలోనే నడుస్తున్నారని రిజిజు ఆరోపించారు. వరుసగా మూడు సార్లు ఓడిపోయినా ఇంకా ఆయనే నాయకుడిగా కొనసాగడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇదే పరిస్థితి బీజేపీలో ఉంటే ఓడిపోయిన నాయకుడు పదవిలో ఉండేవాడు కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రవర్తన బాధ్యతారాహిత్యంగా ఉందని ఆయన విమర్శించారు.