గ్రంథాలయ భవనానికి ఎంపీ రేణుకా చౌదరి శంకుస్థాపన
టేకులపల్లి, జులై 17 (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శుక్రవారం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. గ్రంథాలయాలు సమాజాభివృద్ధికి, విద్యార్థుల విజ్ఞాన వికాసానికి, యువత పోటీ పరీక్షల సన్నద్ధతకు కీలకమైన కేంద్రాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు, పుస్తక ప్రియులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన విద్యా వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో గ్రంథాలయ భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటిడిఎ పీఓ రాహుల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ శ్రీదేవి, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఖాదర్ బాబు, ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.






