1 August, 2026 | 1:36 AM

పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత

01-08-2026 12:47 AM
  1. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి..
  2. తుదిశ్వాస విడిచిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే
  3. పెద్ది పార్ధీవదేహానికి బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితర ప్రముఖుల నివాళి
  4. నల్లబెల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 
  5. శోకసంద్రమైన నర్సంపేట
  6. ‘పెద్ద’ దిక్కును కోల్పోయిన బీఆర్‌ఎస్

మహబూబాబాద్, జులై 31(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి 14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ రథసారథి.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను శుక్రవారం రాత్రి 9:30 గంటలకు వరంగల్ జిల్లా నల్లబెల్లిలో అధికార లాంఛనాలతో నిర్వహించారు.

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరోసారి గుండెపోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున 12:51 గంటలకు తుది శ్వాస విడిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో హనుమకొండ, నర్సంపేటలో అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో నల్లబెల్లికి తీసుకువచ్చారు. కొంతసేపు ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఇంటి వద్ద ఉంచారు. అనంతరం గ్రామంలో అంతిమయాత్ర తర్వాత ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంతక్రియలను నిర్వహించారు.

పెద్దికి అశేష జనవాహిని కన్నీటితో తుదివీడ్కోలు పలికారు. కుమారుడు నిదర్శన్‌రెడ్డి తండ్రి పెద్ది సుదర్శన్‌రెడ్డి చితికి నిప్పంటించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలుసుకున్న వెంటనే రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ఉద్యమకారులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఉమ్మడి వరంగల్ జిల్లా, రాష్ట్ర బీఆర్‌ఎస్ నాయకత్వం పూర్తిగా సికింద్రాబాద్ నుంచి మొదలుకొని నల్లబెల్లిలో పెద్ది అంత్యక్రియలు నిర్వహించే వరకు వెన్నంటి ఉన్నారు.

అలాగే మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, గోరేటి వెంకన్న, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికకాయంపై పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.

శోకసంద్రమైన నర్సంపేట

పెద్ది మరణ వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు ఆయన చివరి చూపు కోసం నర్సంపేట, నల్లబెల్లికి తరలివచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నర్సంపేటకు ప్రజలు తరలివచ్చారు. దీనితో నర్సంపేట పట్టణం పూర్తిగా జనసంద్రంగా మారింది.

హైదరాబాదు నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్ధీవ దేహాన్ని నేరుగా హనుమకొండకు తీసుకువచ్చి సుబేదారి సర్కిల్‌లోని అమరవీరుల స్థూపం వద్ద కొంతసేపు ఉంచారు. అక్కడ పట్టణ ప్రజలు దర్శించిన తర్వాత నర్సంపేటకు పయనమయ్యారు. నర్సంపేట సమీపంలోని గిర్నిబావి సెంటర్ నుంచి నల్లబెల్లి వరకు నిర్వహించిన పెద్ది అంతిమయాత్ర జనసంద్రంగా మారింది. నర్సంపేట పట్టణంలోని పలు కూడళ్లలో పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ఆయన చివరి చూపు కోసం ఎదురు చూశారు. నర్సంపేటకు చేరుకున్న తమ అభిమాన నాయకుడికి అశ్రునయనాలతో తుది నివాళి అర్పించారు.

నర్సంపేట పట్టణం శోక సంద్రంలో మునిగింది. స్వచ్ఛందంగా బందు పాటించారు. తమ ఆత్మీయ నేతను చివరిసారి చూసేందుకు వేలాది జనం ప్రవాహంలో తరలివచ్చారు. నర్సంపేట అభివృద్ధికి, ఈ ప్రాంత వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్ది చేసిన కృషిని గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరూ, ఇంత చిన్నవయసులో మమ్మల్ని ఇలా వదిలి వెళ్లిపోతున్నావంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. 

‘పెద్ద’ దిక్కును కోల్పోయిన బీఆర్‌ఎస్

పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పెద్ద దిక్కును కోల్పోయినట్లే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా పెద్ది గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లబెల్లికి చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపు పొందారు.

2001లో కేసీఆర్ టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో పెద్ది కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. అనతి కాలంలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శి గా, టీఆర్‌ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా, పీఏసీ సభ్యుడిగా పలు పదవులను నిర్వహించారు. పెద్ది మరణ వార్తతో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

‘పెద్ది’ రాజకీయ ప్రస్థానం

 1974 ఆగస్టు 6న నల్లబెల్లిలో పెద్ది రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు సుదర్శన్‌రెడ్డి జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు. 2001 కేసీఆర్ ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో చేరారు. అప్పట్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిపై విజయం సాధించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగారు. 2004లో ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ కన్వీనర్‌గా, 2005లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, అనంతరం మళ్లీ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 8 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి కీలక సారథ్యం వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ పటిష్టత, ఉద్యమ సారథిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన అనేక మహాసభలు, ఉద్యమ కాలంలో నిర్వహించిన అనేక కార్యక్రమాలను పెద్ది సుదర్శన్‌రెడ్డి ముందుండి నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి మళ్లీ నర్సంపేట నుంచి పోటీ చేసి దొంతి మాధవ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నర్సంపేట నుంచి పోటీ చేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి తిరిగి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత శాసన సభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్  చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్నను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి తాను ప్రాతినిథ్యం వహించిన నల్లబెల్లి జెడ్పీటీసీగా పోటీ చేయించి, విజయం సాధించారు. సుదర్శన్‌రెడ్డికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ కీలక నేతల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు.

నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది. ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశాం. ఆయన మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం. పెద్ది మరణం బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని భగవంతున్ని వేడుకున్నారు.

జీర్ణించుకోవడం కష్టంగా ఉంది: మాజీ మంత్రి హరీశ్‌రావు..

ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం  కృషి చేసిన నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ అన్న ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు. వ్యక్తిగతంగా ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయిన బాధ. పెద్ది సుదర్శన్ అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.