29 July, 2026 | 1:53 AM

బుమ్రా, జడేజా రీ ఎంట్రీ

29-07-2026 01:00 AM
  1. సరాంశ్ జైన్‌కు పిలుపు
  2. తొలి టెస్టుకు సుందర్ దూరం
  3. లంకతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

ముంబై, జూలై ౨౮ : వచ్చే నెలలో శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభమన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టుకు కెఎల్ రాహుల్  వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఊహించినట్టుగానే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చేశారు. అయితే బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తేనే తుది జట్టులో ఉంటాడు. వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. ఇదిలా ఉంటే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ సరాంశ్ జైన్‌కు తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కింది.

గాయాల కారణంగా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో సరాంశ్ జైన్‌ను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్ తరపున 131 ఫస్ట్-క్లాస్ వికెట్లు సాధించిన జైన్, ఇటీవల శ్రీలంక ఎ జట్టుపై ఇండియా ఎ తరపున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ నిలకడగా రాణిస్తుండడంతో లంక పిచ్ పరిస్థితులపై జట్టుకు అడ్వాంటేజ్ కానున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్నప్పటకీ ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

33 ఏళ్ల సరాంశ్  జైన్ ఎప్పటినుంచో సెలక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేయడంతో పాటు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు. ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు అతని సొంతం. మరోవైపు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు జట్టు ఎంపికపై ప్రభావం చూపించాయి. బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా అందరూ గాయాలతోనే సతమతమవుతున్నారు.

వీరిలో బుమ్రా ఒక్కడే ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటకీ ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే టెస్ట్ సిరీస్ ఆడతాడు. శ్రీలంక పిచ్‌లకు తగినట్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి నాణ్యమైన స్పిన్నర్లను ఎంపిక చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఈ సిరీస్ భారత్‌కు కీలకం కానుంది.  ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు ఆగస్టు 7వ నుంచి కొలంబోలో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఆగస్టు 15 నుండి గాలే వేదికగా మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుండి కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరుగుతుంది.

లంకతో టెస్టులకు భారత జట్టు:

గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ , యశస్వి జైస్వాల్, దేవ్దత్ పడిక్కల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సరాంశ్ జైన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్.