అనుకున్న సమయానికే ఇరుముడి
రవితేజ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’పై భారీ అంచనాలున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’ ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ చిత్రబృందం ఓ కీలక అప్డేట్‌ను పంచుకుంది. తమ సినిమా విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ, అనుకున్న సమయానికే అంటే ఆగస్టు 21న ’ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని అధికారికంగా ప్రకటించింది.
మరో 25 రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో రవితేజ, చిన్నా రి నక్షత్ర మధ్య తండ్రీ-కూతుళ్ల అనుబంధం ఎంతో ఆప్యాయంగా కనిపిస్తోంది. పేకాటలో నిమగ్నమై ఉన్న రవితేజను ఆ చిన్నారి వెనుక నుంచి ఆప్యాయంగా కౌగిలించుకోవడం ఈ కథలోని భావోద్వేగాన్ని తెలియజేస్తోంది. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నే ని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: విష్ణు శర్మ; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్.






