రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి
- మరో ఇద్దరికి గాయాలు
నార్కట్‌పల్లిలో ఘటన
చిట్యాల, మార్చి 10: నల్లగొండ జిల్లా జాతీయ రహదారి 65పై నార్కట్‌పల్లిలోని నల్లగొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెం దగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న మోజో ట్రావెల్స్ బస్సు, గుజరాత్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ ఒకదానిని ఒకటి ఓవర్ టెక్ చేసే క్రమంలో స్వల్పంగా ఢీకొన్నాయి.
దీంతో వాహనాల డ్రైవర్లు ఫ్లైఓవర్ పక్కన ఆపి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న మరో మోజో ట్రావెల్స్ బస్సు అక్కడికి చేరుకుంది. ఆ బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య కూడా అక్కడికి వచ్చి వారితో మాట్లాడుతుండగా, ఇంతలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ అతివేగంతో వచ్చి ముందు ఆగిన లారీని బలంగా ఢీకొట్టింది.
దీంతో వాహనా ల మధ్య ఉన్న నలుగురు ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో రెండో బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య అక్కడికక్కడే మృతిచెం దగా, మొదటి బస్సు క్లీనర్ సురేష్‌కు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించారు. మూడు వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు దర్యాప్తు చేపట్టామని నార్కట్‌పల్లి సీఐ తెలిపారు.




