11 March, 2026 | 2:52 AM

విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్!

11-03-2026 12:55 AM
  1. అలాంటి వారితో రిపోర్టు తయారుచేయిస్తారా? 
  2. విద్యార్థులపై వామపక్ష భావజాలం రుద్దే ప్రయత్నం 
  3. భారతీయ సంస్కృతి, విలువలతో విద్యావిధానం ఉండాలి
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. అలాంటి భావజాలం ఉన్నవారితో తెలంగాణ విద్యావిధానం- పేరిట నివేదిక తయారుచేయించడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని రాంచందర్‌రావు అన్నారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యావిధా నం అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్‌ఆర్‌సీడీఈ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాంచందర్ రావు, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య,  తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా వర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ తిరుపతిరావు, ఎన్‌సీఈఆర్టీ మాజీ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ పీ మురళీ మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ఇటీవల విద్యా కమిషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌ను రా ష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యావిధానం తీసు కురావాలని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. విద్యావిధానం లక్ష్యం రాష్ట్రంలో అక్షరాస్యత పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు దారి చూపేలా ఉండాలని సూచించారు. కానీ తెలంగాణలో విద్యా వ్యవస్థ గత బీఆర్‌ఎస్ పాలనలోనే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీచర్లకు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, ప్రమోషన్లలో జాప్యం, విద్యా పరిపాలనలో డీఈవోలు, ఎంఈవోల స్థాయిలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఏర్పడిందని, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందన్నారు.

విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేకపోవడం, టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేని దుస్థితి విద్యా వ్యవస్థలో ఏర్పడిందని అన్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్, మిడ్డే మీల్స్‌కు కనీస సదుపాయాలు కూడా సరిపడా లేవని తెలిపారు. గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అలాంటి ఘటనల్లో సుమారు 44 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. 

లక్ష్యాలు కనిపించడంలేదు..

తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో స్పష్టమైన లక్ష్యాలు కనిపించడం లేదని, అందులో పేర్కొన్న అనేక అంశాలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. టీచర్ల పా త్రను ఎవరూ నిరాకరించలేరని, టీచర్లు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే నేషన్ బిల్డర్స్ అన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ప్రతి కిలోమీటర్ పరిధిలో ఒక పాఠశాల ఉండేలా చూడాలని కోరారు.

యంగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు విషయం లో స్పష్టత అవసరం ఉందని, అవి ప్రస్తుత పాఠశాలలను భర్తీ చేస్తాయా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. కేంద్రం రూపొందించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ టీ తిరుపతిరావు మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి తోడ్పడాల్సిన కమిషన్ సూచనలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలోని యూని వర్సిటీల్లో సుమారు 80 శాతం వరకు టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయని, వాటిలో వెంటనే ని యామకాలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ విద్యావిధానంపై ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు. ఎన్‌ఈపీ సూచన ల్లో ఏ ఒక్కటి కూడా కమిషన్ పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మా ట్లాడుతూ.. విద్యా కమిషన్ రిపోర్టులో గతంలో విద్యా వ్యవస్థ ఎందుకు నష్టపోయిందో, భవిష్యత్తులో విద్యా వ్యవస్థను ఎలా అభివృద్ధి చేయాలన్న స్పష్టమైన దిశా నిర్దేశం కూడా రిపోర్టులో లేదన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యా వ్యవస్థ భవిష్యత్తు, విధాన మార్పులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయ వ్యవస్థ, విద్యార్థుల భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. 

వివాదాస్పదంగా సూచనలు.. 

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, రైట్ టు ఎడ్యుకేషన్ అమలుపై కూడా కేంద్ర విధానంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయని రాంచందర్ రావు గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విద్యా కమిషన్ సూచనలు వివాదాస్పదంగా మారాయని తెలిపారు. నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, భారతీయ సంస్కృతి, విలువలను ప్రతిబింబించే విధంగా విద్యా విధానం ఉండాలని ఆయన అన్నారు.

రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టులో సంస్కృతాన్ని తొలగించాలని సూచించడం సరైంది కాదని, సంస్కృతం ప్రాచీన భాషగా దేశ సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సంస్కృతాన్ని తొలగించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలను తొలగించాలనడం కూడా అభ్యంతరకరమని అన్నారు.

ప్రభుత్వ టీచర్ల జీతాల్లో కోత విధించాలని కమిషన్ సూచించిందన్న ప్రచారం సరికాదని, టీచర్ల జీతాలు తగ్గించి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన తప్పుదారి పట్టించేదని విమర్శించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి తక్కువ లేదా జీరో విద్యార్థులు ఉన్న పరిస్థితి ఉందని తెలిపారు. 2024 రాష్ట్రంలో 5,021 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రస్తుతం అవి 2,023కి తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు తయారుచేసేటప్పుడు విద్యావంతులు, విద్యా నిపుణులతో సరైన సంప్రదింపులు జరపలేదని అన్నారు.