రైతు వేదికల నిర్వహణకు చెల్లింపుల్లేవ్!
- మూడున్నరేళ్లుగా పెండింగ్
- ఒక్కో రైతు వేదికకు నెలకు 9 వేల చొప్పున..
- ఏప్రిల్ 2022 నుంచి సెప్టెంబర్ 2022 వరకే నిధుల విడుదల
- గత మూడున్నరేళ్లుగా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న ఏఈవోలు
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): తెలంగాణలో రైతులను సంఘటితం చేసి.. వారి సమస్యలను పరిష్కరించడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. రైతులంతా ఒకేచోట చేరి వ్యవసాయం, సాగు పంటల గురించి చర్చించుకోవడం కోసం, ఉపాధి హామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి రాష్ట్రవ్యాప్తంగా రూ. 573 కోట్లతో 2,604 రైతు వేదికలను ఏర్పాటుచేసింది.
ప్రతి 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి.. క్లస్టర్‌కు ఒక రైతు వేదికను రూ. 22 లక్షల వ్యయంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ప్రతి క్టస్టర్‌కు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన వారిని వ్యవసాయ విస్తరణా ధికారి (ఏఈవో)గా ప్రభుత్వం నియమించిం ది. ఈ రైతు వేదికల నిర్వహణకుగాను ప్రభు త్వం ఒక్కో రైతు వేదికకు నెలకు రూ. 9 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిధులను రైతు వేదికల కరెంట్ బిల్లు, మౌలిక వస తుల కల్పన, మురుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కోసం ఖర్చుచేసేవారు.
అంతేకాకుండా ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమానికి హాజరయ్యే రైతులకు టీ, టిఫిన్లను అందించేవారు. ఇలా 2022 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2022 వరకు ప్రతినెల రూ. 9 వేల చొప్పున రాష్ట్రంలోని 2,604 రైతు వేదికల నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం చెల్లించింది. అంటే ప్రతినెల రూ. 23,43,600 చొప్పున 6 నెలల పాటు మొత్తం రూ. 14.61 కోట్లు ఏఈవోల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది.
ఇక ఆ తర్వాత నుంచి రైతు వేదికల నిర్వహణ కోసం చెల్లించే నిధులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నిలిపివేయడంతో.. ఏఈ వోలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దాదాపుగా మూడున్నరేళ్లుగా రైతు వేదికల నిర్వహణ కోసం చెల్లింపులు నిలిపివేయడంతో.. ఏఈవోలే సొంత డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తున్నది. కనీసం ప్రతినెల రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు తమకొచ్చే వేతనాల నుంచి ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఏఈవోలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ ఏఈవోలలో చాలా మంది ఔట్ సోర్స్ కింద పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారని, వారి వేతనం రూ. 30 వరకు ఉంటుందని, అందులో నుంచి రూ. ఐదారువేలు రైతు వేదికల నిర్వహణ కోసం ఖర్చు చేస్తే.. మిగిలిన వేతనంతో కుటుంబ పోషణ కష్టమవుతోందని ఏఈవోలు ఆందోళన వ్యక్తంచేస్తు న్నారు. ప్రభుత్వాలు మారినా తమకు రైతు వేదికల నిర్వహణ భారం మాత్రం తప్పడం లేదని ఏఈవోలు చెబుతున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైతు వేదికల మెంటెనెన్స్ బిల్లులను చెల్లించి.. రైతు వేదికల నిర్వహణ భారం నుంచి విముక్తి కల్పించాలని ఏఈ వోలు విజ్ఞప్తులు చేస్తున్నారు. రైతు వేదికల నిర్వహణ ఖర్చుల పెండింగ్ విషయం సంబంధిత శాఖ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.




