గ్యాస్ కష్టాలు!
- పెరిగిన ధర, బుకింగ్‌లో ఆంక్షలు
- డెలివరీలో జాప్యం
- జిల్లాలో 611118 గ్యాస్ కనెక్షన్‌లు
- కమర్షియల్ గ్యాస్‌కూ ఇబ్బందులు
- హోటళ్ళు, రెస్టారెంట్లు, పరిశ్రమలు నడపడం కష్టమే
- జిల్లాలో వేలాదిమంది ఉపాధికి ముప్పు?
మేడ్చల్, మార్చి 10 (విజయక్రాంతి): ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ ప్రభావం ఎల్పిజి తో పాటు వివిధ రంగాల మీద తీవ్రంగా కనిపిస్తోంది. ఎల్పిజి ధర పెరగడమే కాక సరఫరా లో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గృహ అవసరాల సిలిండర్ ధర రూ.60 పెరిగింది. గృహసరాల సిలిండర్ గతంలో రూ.65 ఉండగా, ప్రస్తుతం రూ. 965 కి పెరిగింది. అంతేగాక బుకింగ్ లోను ఆంక్షలు విధించారు.
రెండు సిలిండర్లు గల వినియోగదారు ల బుకింగ్ వ్యవధిని 30 రోజులకు, సింగిల్ సిలిండర్ ఉంటే 21 రోజుల తర్వాతే బుక్ చేసుకోవాలి. గతంలో ఈ వ్యవధి 15 రోజులు ఉండేది. గతంలో సిలిండర్ బుక్ చేసిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో ఇంటికి చేరేది. ప్రస్తుతం వారం గడిచిన డెలివరీ ఇవ్వడం లేదు. సిలిండర్ సప్లై లో ఇబ్బందులు ఏర్పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో నెలరోజులు దాటినా సిలిండర్ వచ్చేది కాదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని భయపడుతున్నారు. జిల్లాలో అన్ని రకాల గ్యాస్ కనెక్షన్లు 611118 ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు ఇంటింటికి పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతుంది. పైపులైను గ్యాస్ సరఫరాలోను ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
హోటళ్ళు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు ఇబ్బందులు
వాణిజ్య సిలిండర్లకు బ్రేక్ పడడంతో హోటల్లు, రెస్టారెంట్లు, పరిశ్రమల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, డొమెస్టిక్ వినియోగదారులతోపాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలకు అత్యవసర సెక్టార్లకు ప్రయారిటీ ప్రకారం చేస్తామని ఇండియా ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. నాన్ డొమెస్టిక్ సెక్టార్స్ నుంచి వచ్చే విజ్ఞప్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ పరిశీలించి సరఫరా చేస్తామని తెలిపింది.
దీంతో జిల్లాలోని వందలాది హోటల్లు, రెస్టారెంట్లపై ప్రభావం పడనుంది. పరిశ్రమలకు కూడా ఇబ్బందులు తలెత్తనున్నాయి. గ్యాస్ లేక పరిశ్రమలు మూసివేస్తే అనేకమంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని పరిశ్రమలకు గ్యాస్ అవసరమవుతుంది. జిల్లాలో మేడ్చల్, కుతుబుల్లాపూర్, చర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యల పరిశ్రమలు ఉన్నాయి.
ఇతర రంగాలపై ప్రభావం
యుద్ధ ప్రభావం కేవలం గ్యాస్, పెట్రోల్ మీదనే కాకుండా ఇతర రంగాల మీద కూడా కనిపిస్తోంది. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. జనవరి నుంచి జూన్ వరకు ఇరాన్ నుంచి యాపిల్, కివి పండ్లు దిగుమతి అవుతాయి. ఇరాన్ నుంచి దిగుమతి లేనందున ప్రస్తుతం ఇక్కడి పండ్ల ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఖర్జూరం దిగుమతులు కూడా తగ్గాయి. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే కూరగాయలు, గుడ్లు తదితరవి కూడా నిలిచిపోయాయి. దీంతో ఆయా రంగాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




