అల్లం వెల్లుల్లి పేస్టులో విషం!
- మల్లేపల్లిలో భారీ కల్తీ కేంద్రం
యాసిడ్, గమ్ పౌడర్, సింథటిక్ రంగులే ముడిసరుకు
2 వేల కిలోల నిల్వలు స్వాధీనం
హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులే లక్ష్యంగా విక్రయాలు
షెహజాదా ఫుడ్ మాస్టర్ నిర్వాకుడి అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (విజయక్రాంతి): బిర్యానీలు, కూరల్లో రుచి కోసం వాడే అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు స్లో పాయిజన్‌గా మారుతోంది. కేవలం లాభాలే పరమావధిగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఘరానా కల్తీ దందాను హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ప్రాణాంతక రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న తయారీ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో సుమారు 2 వేల కిలోల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ దందాకు సూత్రధారి అయిన మహమ్మద్ ఫారూఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి రాఘవేందర్ బృందం మల్లేపల్లిలోని షెహజాదా ఫుడ్ మాస్టర్ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టింది. ఈగలు ముసురుతున్న మురికి కూపంలో, దుమ్ము ధూళి మధ్య అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న దృశ్యం వారికి కనిపించింది. సహజ సిద్ధమైన అల్లం,
వెల్లుల్లిని తక్కువ మోతాదులో వాడుతూ.. ఘాటు కోసం అసిటిక్ యాసిడ్, పేస్టు చిక్కగా రావడం కోసం గమ్ పౌడర్, స్టార్చ్ పౌడర్, ఆకర్షణీయమైన రంగు కోసం సింథటిక్ ఫుడ్ కలర్లను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తయారు చేసిన పేస్టును ప్లాస్టిక్ టబ్‌లలో నిల్వ ఉంచి, ప్యాకింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ రసాయనాలతో కూడిన పేస్టును వాడటం వల్ల ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
లైసెన్స్ లేకున్నా ఎనిమిదేళ్లుగా దందా
నిందితుడు మహమ్మద్ ఫారూఖ్ తన అక్రమ వ్యాపారానికి ఎటువంటి అనుమతులు లేకుండానే కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద ఉన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను పరిశీలించగా, అది 2018 సెప్టెంబర్ 7వ తేదీతోనే ముగిసిపోయింది. అయినప్పటికీ అధికారుల కళ్లు గప్పి గత ఎనిమిదేళ్లుగా ఇక్కడి నుంచే కల్తీ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాడు. ముఖ్యంగా నగరంలోని వివిధ హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, పెద్ద ఎత్తున భోజనాలు సరఫరా చేసే ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు ఈ కల్తీ పేస్టును తక్కువ ధరకే విక్రయిస్తూ అక్రమంగా లక్షల రూపాయలు గడిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఆపరేషన్‌లో పోలీసులు సుమారు రూ.2.20 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 1,090 కిలోల తయారైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, 875 కిలోల ముడి అల్లం, వెల్లుల్లి నిల్వలు ఉన్నాయి. వీటితో పాటు తయారీకి ఉపయోగించే భారీ పరిమాణంలో స్టార్చ్ పౌడర్, గమ్ పౌడర్, సింథటిక్ రంగులు, అసిటిక్ యాసిడ్ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. తయారీకి వాడే రెండు గ్రైండింగ్ యంత్రాలను మరియు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.




