11 March, 2026 | 7:37 AM

పొగాకుపై 22 ఏళ్ల నిశ్శబ్ద పోరాటం

11-03-2026 01:18 AM

‘టుబాకో కంట్రోల్ హీరో’గా మాచన రఘునందన్

మునుగోడు, మార్చి 10 (విజయక్రాంతి): పొగాకు వ్యసనం సమాజాన్ని క్రమంగా కుదేలు చేస్తున్న నేపథ్యంలో, ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి పొగాకుకు వ్యతిరేకంగా 22 ఏళ్లపాటు నిస్వార్థ పోరాటం చేసి టుబాకో కంట్రోల్ హీరో అవార్డుకు ఎంపికయ్యారు. ఆ వ్యక్తి పేరు మాచన రఘునందన్. డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రఘునందన్, గత 22 సంవత్సరాలుగా విలాసవంతమైన జీవితం గురించి ఆలోచించకుండా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.

పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడం, యువతను దూరం చేయడం ఆయన జీవిత లక్ష్యంగా మారింది. ఆయన ఈ మాటను వేలాది మందికి చెబుతూ, పొగాకు వ్యసనం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. పొగాకు నియంత్రణపై విశేషంగా పనిచేసే వ్యక్తులకు రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ (ఆర్‌సీటీసీ) సంస్థ ఏటా టుబాకో కంట్రోల్ హీరో అవార్డు అందిస్తుంది.

దేశవ్యాప్తంగా ఎంపికైన 15 మందిలో మాచన రఘునందన్ మాత్రమే వైద్యేతర వ్యక్తి. అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ‘బాల్యం నుంచే నా పరిసరాల్లో జరిగిన కొన్ని సంఘటనలు నాకు పెద్ద పాఠం నేర్పాయి. ఆ అనుభవాలు నాపై గాఢంగా ప్రభావం చూపించాయి. ఇలాంటి దుర్ఘటనలు మరొకసారి సమాజంలో జరగకూడదనే సంకల్పంతో ప్రజల్లో పొగాకు, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగుతున్నాను’ అని మాచన రఘునందన్ తెలిపారు.