26 February, 2026 | 5:53 PM

రెండో రోజు అదే తీరు.. పనిచేయని ఈ నామ్ 2.0 వెర్షన్

26-02-2026 03:48 PM

పనిచేయని ఈ నామ్ 2.0 వెర్షన్ 

మార్కెట్లలో రైతుల ఆందోళన 

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్(National Technology Marketing) విధానం ఈనామ్ అమలు చేస్తున్న వివిధ మార్కెట్లలో బుధవారం నుండి కొత్తగా ప్రవేశపెట్టిన 2.0 వెర్షన్(e-NAM 2.0) ఆదిలో హంసపాదుగా మారింది. రెండో రోజు కూడా ఆన్లైన్ విధానం మొరాయించింది. దీనితో రాష్ట్రంలోని 47 వ్యవసాయ మార్కెట్లలో రైతుల వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారులు కొనడానికి ఆటంకంగా మారింది. ఈ నామ్ విధానం పనిచేయకపోవడంతో నిజామాబాద్ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు.

అలాగే వివిధ చోట్ల నూతన సాఫ్ట్వేర్ సరిగా పనిచేయకపోవడంతో మార్కెట్ల కార్యదర్శులు మ్యానువల్ విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళను నిర్వహించాల్సి వచ్చింది. దీంతో చాలాచోట్ల మార్కెట్లలో రైతులు గంటలు తరబడి తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నామ్ 1.0 వెర్షన్కు బదులు 2.0 నూతన వెర్షన్ అమలులోకి తెచ్చిన సాఫ్ట్వేర్ సంస్థ లోటుపాట్లను ఇప్పటివరకు సరి చేయకపోవడంతో మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలతో పాటు ఇతర లావాదేవీలకు సంబంధించిన ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.