12 May, 2026 | 2:06 AM

భారత్ ఎవరికీ తలవంచదు

12-05-2026 01:05 AM
  1. దేశ ఆత్మ గౌరవానికి ప్రతీక సోమనాథ్
  2. విదేశీ ఆక్రమణదారులు ఎన్నిసార్లు కూల్చినా మళ్లీ నిర్మించుకున్నాం
  3. ఆలయ అమృతోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ
  4. సోమనాథుడికి పుణ్యక్షేత్ర జలాలతో అభిషేకం
  5. గగనతలంలో భారత వాయుసేన విన్యాసాలు

గాంధీనగర్, మే ౧౧: భారత్ ఎవరికీ తలవంచదని, అందుకే.. దేశాన్ని అణచివేయడం ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా ప్రభాస్ పటాన్ లో సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన అమృతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా మోదీ ప్రభా స్ పటాన్‌లో రోడ్‌షో నిర్వహించారు.

రోడ్డు కు ఇరువైపులా వేలాది మంది ప్రజలు జేజే లు పలుకుతూ ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ ఆలయానికి చేరుకు ని సోమనాథుడికి 11 పుణ్యక్షేత్రాల జలాలతో కుంభాభిషేకం, మహాపూజ నిర్వహించారు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు. వేడుకల సందర్భంగా భారత వాయు సేన విమానాలతో గగనతలంలో విన్యాసాలు చేసింది. ‘సూర్య కిరణ్’ అనే విమాన శ్రేణి ఆలయ శిఖరం పైనుంచి చక్కర్లు కొట్టింది.

తర్వాత మోదీ ప్రసంగిస్తూ.. సోమనాథ్ ఆల యం దేశ ఆత్మ గౌరవానికి ప్రతీక అని అభివర్ణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, బా బూ రాజేంద్రప్రసాద్ వంటి నేతలు ఆలయ పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలోనూ కొందరు రాజకీయ నేతలు ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. అదేతరహా మన స్తత్వం అయోధ్య రామమందిర నిర్మా ణం సమయంలోనూ కనిపించిందని ఆవేదన వ్యక్తంచేశారు.

విదేశీ దురాక్రమణదారులు సోమనాథ్ ఆలయాన్ని ఎన్నిసార్లు కూల్చినా, భారతీయులు దానిని మళ్లీ మళ్లీ నిర్మించుకుంటూ వచ్చారని, ఇదే భారత నిజమైన ఆత్మ అని పేర్కొన్నారు. ఆల య అమృతోత్సవాల నిర్వహణ అంటే, కేవలం గతాన్ని స్మరించుకోవడమే కాదని, రానున్న వెయ్యేళ్ల వరకు వేడుకలు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆకాంక్షించారు. 1998లో సరిగ్గా ఇదే రోజున (మే ౧౧) పోఖ్రా న్ అణు పరీక్షలు విజయవంతమయ్యాయని గుర్తుచేశారు.

అణ పరీక్షల నేపథ్యంలో ప్ర పంచ దేశాలన్నీ ఆర్థికపరమైన ఆంక్షలు విధించి భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూశాయన్నారు. అలాంటి క్లిష్ట సందర్భంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా అణు పరీక్షలు నిర్వహించారని కొనియాడారు. భారత్ రాజకీయ సంకల్పం ఎంత దృఢంగా ఉంటుందనేది అణుపరీక్షలు చాటి చెప్పాయని అభిప్రాయపడ్డారు.

ఆలయ 75 ఏళ్ల వేడుకలకు సంబంధించి మోదీ అనంతరం ఒక తపాలా బిళ్లను సైతం విడుదల చేశారు. వేడుకల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేం ద్ర పటేల్, హోం శాఖ మంత్రి హర్ష్ సంఘ వి, సోమనాథ్ ట్రస్ట్ కార్యదర్శి పీకే లహిరి తదితరులు పాల్గొన్నారు.

అవే వ్యాఖ్యలు.. మళ్లీ దుమారం

సోమనాథ్ పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం వడోదర చేరుకున్న ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణ, విదేశీ మారక ద్రవ్యం ఆదాపై ఆదివారం చేసిన వ్యాఖ్యలనే పునరావృతం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత ఏర్పడిందని, ఇలాంటి క్లిష్ట సమయంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఉద్ఘాటించారు.

పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని, మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు వంటి ప్రభుత్వ రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్ పూలింగ్ పద్ధతి పాటిస్తే మేలు అని, ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణిస్తే మరింత ఇంధనం ఆదా అవుతుందని, రవాణా ఖర్చులు మిగులుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోం సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

డిజిటల్ సాంకేతికత అందుబాటులో ఉన్నందున వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భారత్ యేటా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని బంగారం దిగుమతి కోసం ఖర్చు చేస్తోందని, అందుకే వినియోగదారులు మరో ఏడాది వరకు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలు, విదేశాల్లో వివాహాలు సైతం రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రధాని వ్యాఖ్యలతో మళ్లీ దేశవ్యాప్తంగా దుమారం రేగింది.

నగల దుకాణ కంపెనీలు మోదీ వ్యాఖ్యలపై పెదవి విరుస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయ్యే సమయంలో ప్రధాని వ్యాఖ్యలు మార్కెట్‌ను పడగొట్టేలా ఉన్నాయని వాపోతున్నాయి. ఇప్పటికే తమ షేర్లు పడిపోయాయని, మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తే మరింత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.