27 February, 2026 | 5:35 AM

ఉన్నతాధికారి.. అవినీతే ఆయన దారి!

27-02-2026 12:00 AM
  1. నల్లగొండ జిల్లా సహకార బ్యాంకులో ఓ అధికారి ఇష్టానుసార వ్యవహారం

ప్రభుత్వ వాహనం ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనంలోనే టూర్స్ 

ఆ వాహనానికి ప్రభుత్వ సొమ్ము  క్లైమ్ చేస్తున్నట్లు ఆరోపణలు 

కార్యాలయ ఉద్యోగినితో ఇంటి పనులు

ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకోలు 

మిర్యాలగూడ, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) :  రైతుల అభివృద్ధియే ధ్యేయంగా పనిచేసే  కార్యాలయం అది. నల్లగొండ జిల్లా సహకార బ్యాంకులో పనిచేసే ఓ ఉన్నతాధికారి తన ఇష్టానుసారంగా ప్రజాధనంను కొల్లగొడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ జిల్లా సహకార బ్యాంకుకు ప్రభుత్వ వాహనము ఆ వాహనంకు డ్రైవరు పర్మినెంటుగా ప్రభుత్వమే కేటాయిస్తుంది. కానీ ప్రభుత్వ వాహనంలో తన సొంత పనులకు వీలు ఉండదని ప్రైవేటు వాహనంతో పాటు డ్రైవర్ను నియమించుకొని ప్రభుత్వ సొమ్ముకు గండి కొడుతున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి.

అవసరం లేకపోయినా ఈ ప్రైవేట్ వాహనంలో టూర్స్ పేరు చెప్పుకొని వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు హైదరాబాదుకు పయనిస్తున్నాడని ఈ ప్రయాణ ఖర్చులకు ప్రభుత్వ సొమ్ము క్లైమ్ చేసుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ తతంగం ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి  ఇప్పటివరకు నడుస్తూనే ఉన్నట్లు తెలుస్తుంది. సంబంధిత పై అధికారులు  మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల జిల్లా రైతులు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టు స్థానికంగా వినిపిస్తుంది. సంబంధిత అధికారులతో పాటు చైర్మన్లు మారినప్పటికీ ఆ అధికారిని ఎందుకు ప్రశ్నించడం లేదని వాదనలను కూడా బలంగా వినిపిస్తున్నాయి.

ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగితో సొంత పనులు

 అదే కార్యాలయంలో ఓ ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగితో తన సొంత ఇంటి పనులు చేయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. ఆ మహిళా ఉద్యోగి కార్యాలయం నుండి జీతం పొందుతున్నప్పటికీ ఆ అధికారి ఇంట్లో పని చేయించుకోవడం ఏమిటని ప్రజలు బహిరంగగానే చర్చించుకుంటున్నారు.

అవసరం లేకున్నా సిబ్బంది  నియామకం

నల్లగొండ జిల్లా పరిధిలోని నూతనంగా ఏర్పాటు అవుతున్న సహకార బ్యాంకు లకు అవుట్ సోర్సింగ్ నైట్ వాచమెన్ లు అవసరం లేకపోయినా వేలకు వేలు డబ్బులు తీసుకొని నియమించిన సంఘటనలు చాలానే ఉన్నాయని బహిరంగ గానే వినిపిస్తుండడం గమనార్హం.

 సీసీ నిఘా తన మొబైల్ లోనే : 

కార్యాలయంలో సీసీ నిఘా ఉన్నపటికీ ఎక్కడ డిస్ప్లే చేయకుండా తన మొబైల్ లో మాత్రమే వీక్షించే అవకాశం కల్పించుకొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయంపై ఆ కార్యాలయం నుండే డిస్ప్లేను ఏర్పాటు చేయకుండా తను ఒక్కడు మాత్రమే పరిశీలించడం ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ లో చూస్తూ అతను చెప్పినట్టు మాట వినని సిబ్బందిని టార్గెట్ చేస్తూ వారిని మానసిక ఇబ్బందులకు గురించేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.

 అర్హత లేకన్నా పొందుతున్న ఎంప్లాయిస్ ప్రావీడెండ్ ఫండ్ ! :

వాస్తవికంగా ఆ అధికారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయినప్పటికీ పి ఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏవిదంగా పొందుతున్నాడని బహిరంగంగానే చర్చించడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హత లేకపోయినా ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.