ఐదుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేత
కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేసిన దివ్యాంగులు
సిరిసిల్ల,(విజయక్రాంతి): ఐదుగురు దివ్యాంగుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సత్వరం స్పందించి వారి సమస్యకు పరిష్కారం చూపారు. కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లింగంపల్లి లక్ష్మి, కుడుకల దేవయ్య, ఇద్దగిరి లక్ష్మణ్, నాగుల అశోక్, సోమురెడ్డి రాజు దివ్యాంగులు ఐడీఓసీకి రాగా, వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమస్యపై వచ్చారో అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందిని తెలుసుకొని తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ వారికి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. వారికి వెంటనే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు, హెల్మెట్ జిల్లా కలెక్టర్ అందజేశారు. తమ సమస్య, ఇబ్బందులను అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు అందజేసిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు.






