22 August, 2026 | 4:37 PM

సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ రూపా రెడ్డికి శ్రద్ధాంజలి

22-08-2026 03:37 PM

కేసముద్రం (విజయక్రాంతి): హత్యకు గురైన ప్రిన్సిపల్ రూపా రెడ్డికి కేసముద్రం సెయింట్ జాన్స్ హై స్కూల్లో శ్రద్ధాంజలి ఘటించారు. రూపా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పాఠశాల కరస్పాండెంట్ అల్లం శ్రావణ్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. నల్లగొండ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనలో మృతి చెందిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి మరణం పట్ల పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే మార్గదర్శకులనీ పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు, అపార్ధాలు లేదా ఆవేశాలకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని పేర్కొన్నారు.

విద్యార్థులు కోపం, ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని పెద్దల సూచనలు, ఉపాధ్యాయుల సలహాలను గౌరవించాలని సూచించారు. పాఠశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆలయాలని ఆయన అన్నారు. సమాజంలో శాంతి, సహనం మరియు పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. రూపారెడ్డి మృతి విద్యారంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ  కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అఖిల్, ఉపాధ్యాయులు నామాల మహేష్, లాల్ బహదూర్ , శౌరెడ్డి, రమేష్, వేణుగోపాల్. హరిబాబు, ఐలయ్య, చైతన్య, రోజా, లిల్లీ, అమల, శ్వేత, రాధిక, సంగీత, నిరీక్షణ, యామిని, అరుణ్, దేవు, నరేష్ ,చక్రు, వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు.