17 May, 2026 | 1:23 AM

కొమురవెల్లికి రైలు కూత

17-05-2026 12:29 AM
  1. ఈ నెలాఖరులో రైల్వే స్టేషన్ ప్రారంభం 
  2. యాదాద్రి వరకు కొనసాగుతున్న ఎంఎంటీఎస్ విస్తరణ పనులు
  3. దేశంలోనే అత్యుత్తమ రైల్వే వ్యవస్థగా హైదరాబాద్ 
  4. శరవేగంగా రెండో దశ విస్తరణ పనులు 
  5. ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు 
  6. మలక్‌పేట్, ఉప్పుగూడ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేయనున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  కొమురవెల్లి మల్లన్న భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మించామన్నారు. ఇప్పటికే 100 శాతం పనులు పూర్తయ్యాయని, హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ పనులు సైతం కొనసాగుతున్నాయని తెలిపారు. మలక్‌పేట్, ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునీకరణ పనులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల సహకారంతో హైదరాబాద్ రైల్వే వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు.

తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే ఉప్పుగూడ, మలక్‌పేట్ స్టేషన్లను ప్రజలు ఎంతగా ఉపయోగించుకునేవారో చూశానని, ఇప్పుడు మళ్లీ ఆ స్టేషన్లకు పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. పాతబస్తీ ప్రజలు కూడా గర్వపడేలా ఈ స్టేషన్లను అందంగా, ఆధునీకరంగా 

తీర్చిదిద్దుతున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్త రణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగర ప్రజలకు మెరుగైన  రవాణా సౌకర్యాలు అందుతాయని తెలిపా రు.

పాతబస్తీ ప్రజలకు కూడా దేశంలోని ఇతర నగరాల స్థాయిలో రైల్వే సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.  ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా లిఫ్టు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫామ్స్, షెల్టర్లు, మెరుగైన పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, ఆధునిక వెయిటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తరహాలో..

ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను సుమారు రూ. 720 కోట్లతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ పుదిద్దుకుంటోందన్నారు.   నాం పల్లి రైల్వే స్టేషన్‌ను కూడా రూ. 350 కోట్లతో ఆధునీకరిస్తున్నామనిర, అక్కడ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.

హైదరాబాద్ నగరంలో హఫీజ్‌పేట్, బేగంపేట్, నాంపల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మలక్‌పేట్, యాకత్‌పురా, ఉప్పుగూడ, ఉమదానగర్, షాద్‌నగర్, మల్కాజిగిరి, మేడ్చల్ తదితర రైల్వే స్టేషన్ల ఆధునీకరణను ఒకేసారి  కేంద్రం అమలు చేస్తోందన్నారు. నగరంలో ని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అభివృద్ధి అందించడమే లక్ష్యమన్నారు. రైల్వే మౌలిక వసతులు అభివృద్ధి చెందడం ద్వా రా ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.